సైఫాబాద్ పోలీసు స్టేషన్‌కు రోజా తరలింపు: అంతకు ముందు తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్: శాసనసభ ఆవరణలోకి రావడానికి ప్రయత్నించిన సస్పెన్షన్‌కు గురైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజాను శనివారం ఉదయం భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులకు, భద్రతా సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. రోజాను మహిళా మార్షల్స్ గెంటేశారు. ఆ తర్వాత ఆమెను పోలీసులు సైఫాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
బూతులు మాట్లాడాల్సిన అవసరం తమకేమిటని శాసనసభ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా అడిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను ఒక్కదాన్నే నినాదాలు ఇవ్వలేదని, తమ పార్టీ సభ్యులంతా ఇచ్చారని ఆమె చెప్పారు. శనివారంనాడు ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
మహిళలను వ్యభిచారంలోకి దించుతున్నవారిపై చర్చిద్దామంటే తొలుత అంబేడ్కర్‌ను అడ్డం పెట్టారని, ఆ తర్వాత తనను సస్పెండ్ చేశారని ఆమె అన్నారు. తాను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకనే తనను సస్పెండ్ చేశారని ఆమె అన్నారు. కాల్ మనీపై చర్చలో తానే మొదటి వక్తను అని, అందుకే తనను సస్పెండ్ చేశారని ఆమె అన్నారు.

అత్యాచారాలూ హత్యలు చేసేవారికి పిక్ ప్యాకేట్ చేసేవారికి ఒకే రకమైన శిక్ష అనే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆమె అన్నారు. మహిళలను వేధించి, సెక్స్ రాకెట్‌లోకి దించాలని ప్రయత్నిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని అడుగుతుంటే వడ్డీవ్యాపారులందరిపై దాడులు చేస్తున్నారని ఆమె అన్నారు. వడ్డీ వ్యాపారుల నుంచి ప్రజలను రక్షించే ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వం చేపట్టలేకపోయిందని ఆమె అన్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు, శానససభ్యులు బుచ్చయ్య చౌదరి, బోడె ప్రసాదం మాట్లాడిన తీరు, చంద్రబాబు మాట్లాడిన తీరు రౌడీలు మాట్లాడినట్లుగా ఉందని ఆమె అన్నారు. అసెంబ్లీలోనే ఓ మహిళ నోరు మూయించగలిగారు, తమ పరిస్థితి ఏమిటనే బాధిత మహిళలు ముందుకు వచ్చేందుకు అవకాశం లేకుండా చేస్తున్నారని ఆమె అన్నారు.
తన హావభావాలు సరిగా లేవని అంటున్న అధికార తెలుగుదేశం పార్టీ సభ్యుల మాటలను ఆమె వ్యతిరేకించారు. తాను టిడిపిలో ఉన్నప్పుడు 15 ఏళ్లు తన హావభావాల గురించి మెచ్చుకున్నవారే ఇప్పుడు హావభావాలు సరిగా లేవని అంటున్నారని ఆమె అన్నారు. 15 ఏళ్లు తన బాడీ లాంగ్వేజ్ బాగున్నప్పుడు ఇప్పుడే బాగా లేదా అని ఆమె అడిగారు.












Click it and Unblock the Notifications