వైసీపీ సర్కార్ గన్ మెన్లు ఎందుకిచ్చిందంటే ? కస్టడీలో నోరువిప్పిన బోరుగడ్డ..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి విపక్ష నేతల్ని బెదిరించిన ఆరోపణలు ఎదుర్కొంటూ, ఓ చర్చి ట్రెజరర్ ను 50 లక్షల కోసం బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ నోరువిప్పాడు. కోర్టు ఆదేశాలతో ఆయన్ను కస్టడీలో విచారిస్తున్న పోలీసులకు ఎట్టకేలకు వైసీపీతో తన బంధంతో పాటు అప్పట్లో గన్ మెన్లు తీసుకోవడానికి దారి తీసిన పరిస్దితుల్ని కూడా వెల్లడించాడు.
వైసీపీ సర్కార్ హయాంలో విపక్ష నేతల్ని టార్గెట్ చేస్తే పెద్ద పదవులు ఇస్తామంటూ వైసీపీ పెద్దలు తనకు ఆఫర్ చేశారని కస్టడీలో బోరుగడ్డ పేర్కొన్నాడు. అలాగే అప్పట్లో వైసీపీ పెద్దలతో పాటు ఓ సీనియర్ ఐపీఎస్ సూచనల మేరకే తనకు గన్ మెన్లను కూడా కేటాయించారని తెలిపాడు. తద్వారా వైసీపీ హయాంలో తన హవా ఎలా నడిచిందో బోరుగడ్డ వెల్లడించాడు. వైసీపీ పెద్దలు ఆశ చూపిన పెద్ద పదవి కోసమే తాను ఈ దందాలు, బెదిరింపులకు పాల్పడాల్సి వచ్చిందని చెప్పేశాడు.

ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు బోరుగడ్డ అనిల్ కుమార్ కు తమ పార్టీలో ఎలాంటి సంబంధం లేదని చెప్పిన నేపథ్యంలో పోలీసు కస్టడీలో ఆయన చెప్పిన విషయాలు చర్చనీయాంశమవుతున్నాయి. వైసీపీ హయాంలో ప్రభుత్వ పెద్దలతో తనకు ఎలాంటి సంబంధం లేకపోతే ఏకంగా రౌడీ షీటర్ గా ఉంటూ గన్ మెన్లను ఎలా పొందగలిగారన్న చర్చ జరుగుతోంది. మూడు రోజుల కస్టడీలో బోరుగడ్డ చెప్పే విషయాల ఆధారంగా ఆయనతో లింకులున్న వైసీపీ పెద్దల్ని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చే అవకాశం ఉందని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications