Ayodhya Ramireddyకి ఐటీ షాక్ -రాంకీ గ్రూపు సోదాల్లో రూ.300 కోట్ల బ్లాక్ మనీ గుర్తింపు
వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డికి చెందిన రాంకీ గ్రూప్ సంస్ధలకు ఆదాయపు పన్నుశాఖ షాకిచ్చింది. తాజాగా హైదరాబాద్ లో జరిపిన సోదాల్లో భారీగా నల్లధనం బయటపడినట్లు ఇవాళ ప్రకటించింది. స్టాక్ మార్కెట్ తో పాటు ఇతర లావాదేవీల ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు ఐటీ శాఖ గుర్తించింది.
వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డికి చెందిన రాంకీ గ్రూప్ లోని పలు సంస్ధల కార్యాలయాల్లో ఈ నెల 6వ తేదీన ఐటీ అధికారులు 15 బృందాలతో సోదాలు నిర్వహించారు. ఇందులో భారీ ఎత్తున నగదును గుర్తించారు. దాదాపు రూ.1200 కోట్ల కృత్రిమ నష్టాల్ని చూపినట్లు కూడా అధికారులు ప్రకటనలో తెలిపారు. ఇందులో భారీగా డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటిని పరిశీలించినప్పుడు లెక్కల్లో లేని రూ.300 కోట్ల ఆదాయం బయటపడినట్లు ప్రకటించారు.

Recommended Video
రాంకీ గ్రూపు సంస్ధలు రూ.288 కోట్ల మేర వసూలు కాని బాకీల్ని చూపాయని, వీటిని ఆదాయం నుంచి తొలగిస్తామని ఐటీ అధికారులు ప్రకటనలో తెలిపారు. ఐటీ సోదాల్లో బయటపడిన బ్లాక్ మనీకి నిబంధనల ప్రకారం పన్ను చెల్లించేందుకు రాంకీ గ్రూప్ అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. వైసీపీ ఎంపీల్లో అత్యధిక ఆస్తులు కలిగిన ఎంపీగా పేరు తెచ్చుకున్న అయోధ్య రామిరెడ్డి.. తాను ఎంపీ కాగానే సంస్ధల డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నారు. అయితే ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఈ సంస్ధల్ని నడుపుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications