"జై భీమ్" ఫేమ్ Justice Chandru:ఏపీ హైకోర్టు పై హాట్ కామెంట్స్..ప్రభుత్వంతో ఏంటిలా..?
మిగతా వ్యవస్థల మాదిరిగానే న్యాయ వ్యవస్థ క్కూడా పరిమితులున్నాయని మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, జైభీమ్ సినిమా ఫేం జస్టిస్ కె.చంద్రు వ్యాఖ్యానించారు. ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ (ఏపీసీఎల్‌ఏ)-కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రు రాష్ట్ర హైకోర్టుకు సంబంధించి కొన్ని సునిశితమైన విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులతో కాకుండా న్యాయవ్యవస్థతో పోరాడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు.

హైకోర్టు నిర్ణయాల పైన
హెబియస్ కార్పస్ పిటిషన్లలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుంటే జరిమానా విధించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసారు. అంతకు మించి ఉత్తర్వులివ్వటం సరికాదన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు తప్పని న్యాయమూర్తులు బహిరంగ వేదికలపై క్షమాపణలు చెప్పిన సందర్భాలున్నాయని, మరింత మంది జడ్జీలు ఇలా తప్పు ఒప్పుకునే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలకు సంబంధించి సీబీఐ దర్యాప్తునకు అప్పగించటం, నిందితులను పట్టుకోవటానికి విదేశాలకు దర్యాప్తు అధికారులను పంపటం వంటి చర్యలను తప్పుబట్టారు.

కేసులు వేస్తే తప్ప ప్రభుత్వ స్పందన లేదు
కోర్టులు తమ పరిధులను తెలుసుకోవాలని జస్టిస్ చంద్రు అభిప్రాయపడ్డారు. తాను కోరుకునేది ఒక్కటేనని.. మానవ హక్కుల పరిరక్షణ అని చెప్పుకొచ్చారు. అది ఏ వ్యక్తికి సంబంధించినదైనా కావొచ్చని వ్యాఖ్యానించారు. అంతకు ముందు ఏపీసీఎల్‌ఏ ప్రధాన కార్యదర్శి పొత్తూరి సురేశ్ కుమార్ న్యాయస్థానాల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తే తప్ప ఈ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కోర్టు ఆదేశాలతోనే పనులు అవుతున్నాయన్నారు. న్యాయవాదులకు రాజ్యాంగమే ఆయుధమని, వారు డబ్బు కోసం కాకుండా హక్కుల కోసం పని చేయాలని జస్టిస్ చంద్రు చెప్పారు.

వ్యవస్థలు పరిధిలో పని చేయాలి
బాధితుడికి న్యాయం చేస్తే ప్రశాంతంగా నిద్ర పోవచ్చన్నారు. డబ్బులు ముఖ్యం కాదని, సేవ చేయాలనే దృక్పథంతో వృత్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు అంతరం ఉండడం మంచిది కాదు. ప్రభుత్వం, న్యాయవ్యవస్థే కాదు... అన్ని వ్యవస్థలూ వాటి పరిధిలో పనిచేయాలంటూ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రు చెప్పుకొచ్చారు. చట్ట సభల్లో చేసిన చట్టాలను న్యాయ వ్యవస్థ చెప్పకుండానే ప్రభుత్వం ఉపసంహరించుకుంటోందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవ్యవస్థ మరో మార్గంలో నడుస్తుందన్న భావన కలుగుతోందని పేర్కొన్నారు.
Recommended Video

మూడు రాజధానుల అంశంలోనూ
ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును చేసిందని... అమరావతిని యథాతథంగా కొనసాగించాలని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని చెప్పారు. ఈ కేసులను విచారించే న్యాయమూర్తులకు అమరావతిలో భూములు ఉన్నందున ప్రభుత్వం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసిందని... ఈ కేసులను మరో బెంచ్‌కు మార్చాలని కోరిందన్నారు.
దానికి ఆ న్యాయమూర్తులు 'ఆ కేసులను మేమే విచారిస్తాం' అని చెప్పారని... అలా ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితులు ఉన్న న్యాయవ్యవస్థలో న్యాయం ఎక్కడుందని ప్రశ్నించారు. ఇప్పుడు జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యల పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications