చేతకానోళ్లే డైలాగులు..ఈలలు అందరికీ వేస్తారు-వీరసింహారెడ్డి డైలాగ్స్ కు బైరెడ్డి సిద్ధార్ధ్ కౌంటర్
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయం ఓ రేంజ్ లో సాగుతోంది. ప్రత్యర్ధుల్ని విమర్శించడానికి అందివచ్చిన ఏ అవకాశాన్నీ ఎవరూ వదులుకోవడం లేదు. ఇదే క్రమంలో తాజాగా విడుదలైన బాలయ్య సంక్రాంతి సినిమా వీరసింహారెడ్డిలో వైసీపీ ప్రభుత్వంపై ఆయన వేసిన డైలాగ్స్ సంచలనం రేపాయి. వైసీపీ సర్కార్ పై బాలయ్య డైలాగ్స్ పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదే క్రమంలో శాప్ ఛైర్మన్, వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి స్పందించారు.
బాలయ్య వీర సింహారెడ్డి సినిమాలో కొన్ని డైలాగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్నాయన్న విమర్శల నేపథ్యంలో శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీటిపై స్పందించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా అనంతపురం మండలం ఏ నారాయణపురం వద్ద రాతిదూలం లాగుడు పోటీలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీరసింహారెడ్డి డైలాగులపై ఘాటుగా స్పందించారు. ప్రెస్ మీట్ లు పెట్టడం చేతకానోళ్ళు కూడా సినిమాలలో డైలాగులు చెబుతున్నారంటూ బైరెడ్డి కౌంటరిచ్చారు. వీళ్ళు ఎన్ని సినిమా డైలాగులు చెప్పినా, మీసాలు తిప్పినా తొడలు కొట్టినా మనం నమ్ముకునేది కేవలం ప్రజలనే అని,ఆ ప్రజల అభిమానం ఉన్నంతవరకు సీఎం జగన్మోహన్ రెడ్డి దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేరని తేల్చి చెప్పారు.
అదే సమయంలో రాష్ట్రంలోని యువత కూడా అన్ని రంగాలపై అవగాహన కలిగి ఉండాలని బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డి సూచించారు. ఏది వాస్తవం, ఏది అవాస్తవమో తెలుసుకోగలగాలి అంటూ సూచించారు. మేమొస్తే మాకూ ఈలలు కొడతారు, వాళ్ళు వస్తే వాళ్లకు ఈలలు కొడతారని ఓట్లు వేసేది మాత్రం ఒకరికే, అది జగన్ కు అని బైరెడ్డి వ్యాఖ్యానించారు. నాలాంటి యువకులను ఎంతోమందిని ప్రోత్సహించి ఒక స్థానంలో కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి పై మీ అందరికీ ప్రేమ ఉండాలని యువతకు సూచించారు. రాష్ట్రంలో ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సీఎం జగన్ ఉన్నత పదవులు కట్టబెట్టారని, వారంతా ఇప్పుడు జగన్ కు అండగా నిలబడాలని బైరెడ్డి కోరారు.












Click it and Unblock the Notifications