కండ్రిగలో సచిన్ క్రికెట్: అది నావంతు నిలబెట్టుకోవడం..
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజువారికండ్రిగలో పర్యటిస్తున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ చిన్నారులతో క్రికెట్ ఆడనున్నారు. సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద సచిన్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గ్రామానికి చేరుకున్న సచిన్ పైలాన్ ఆవిష్కరించారు. చేపల చెరువులో చేపలు వదిలి మీనోత్సవం ప్రారంభించారు.
గోమాతకు పూజలు చేశారు. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడారు. పాఠశాలలో ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించారు. గ్రామస్థులతో కలిసి స్వచ్చ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారితో స్వచ్ఛ భారత్ కోసం ప్రమాణం చేయించారు.
గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం తన వంతు అని, దానికి నిలబెట్టుకోవడం మీ వంతు అని సచిన్ అన్నారు. తన అభివృద్ధి కార్యక్రమాలు తొలి ఇన్నింగ్స్ అయితే, దానిని గ్రామస్థులు నిలబెట్టుకోవడాన్ని రెండో ఇన్నింగ్స్‌గా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

గ్రామస్తులను సమస్యలు అడిగి తెలుసుకున్న సచిన్ టెండుల్కర్.. కోకోలు శివయ్య పిల్లల చదువు ఖర్చులు తానే భరిస్తానని హామీ ఇచ్చారు. కంపోస్టు యార్డు నిర్మాణ పనులను పరిశీలించారు. సచిన్ రూ.2.79 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు.
సచిన్ రాక నేపథ్యంలో గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ, చాముండేశ్వరీనాథ్, తదితరులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సచిన్ టెండుల్కర్‌ను చూసేందుకు పక్క గ్రామాల నుండి కూడా తరలి వచ్చారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
పుట్టంరాజువారి కండ్రిగ పర్యటనలో భాగంగా గ్రామ యువతతో, పాఠశాల విద్యార్థులతో సచిన్ సరదా మ్యాచ్ ఆడనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పిచ్ సిద్ధం చేశారు.. సచిన్‌తో సరదా క్రికెట్ ఆడే అవకాశం రావడంతో అనందించారు.












Click it and Unblock the Notifications