సచిన్: కృష్ణపట్నం పోర్టుకు ఫిదా, పిల్లలతో కరచాలనం
నెల్లూరు: అతి తక్కువ వ్యవధిలో అభివృద్ధి చెందిన కృష్ణపట్నం ఓడరేవు దేశాభివృద్ధిలో కీలకంగా మారిందని క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ ప్రశంసించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు వద్ద ఉన్న కృష్ణపట్నం పోర్టును శనివారం సచిన్ సందర్శించారు. చెన్నై నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పోర్టుకు చేరుకున్న ఆయనకు పోర్టు యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. పోర్టు భద్రతా సిబ్బంది నుంచి సచిన్ గౌరవ వందనం స్వీకరించారు.
ఆ తర్వాత పోర్టు చేపట్టిన కోటి మొక్కల ఉద్యమంలో భాగంగా పోర్టు ఆవరణలో సచిన్ మొక్కలు నాటారు. గ్రామీణ ప్రజల జీవనవిధానాన్ని మెరుగు పరిచేలా సీవీఆర్ ఫౌండేషన్ చేపడుతున్న సామాజిక కార్యక్రమాలతో ఎంతో సంతోషంగా ఉందని సచిన్ ఈ సందర్బంగా అన్నారు. ముంబైలో తనకు వైద్యమందించే డాక్టర్ సందేష్ మయేకర్ కృష్ణపట్నం పోర్టులో కార్పొరేట్ తరహా దంత వైద్యశాల నిర్వహిస్తుండటం అభినందనీయమన్నారు. సీవీఆర్ ఫౌండేషన్ ద్వారా పేదలకు విద్య, వైద్య సేవలు అందించడం చూస్తుంటే ఆ సంస్థ సామాజిక బాధ్యతను ఎంత చిత్తశుద్ధితో నిర్వహిస్తుందో అర్థమవుతుందన్నారు.

పర్యావరణ పరిరక్షణ కోసం పోర్టు యాజమాన్యం చేపట్టిన కోటి మొక్కల ఉద్యమంలో తానూ భాగస్వామిగా మారడం ఆనందంగా ఉందన్నారు. చెన్నై నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు సచిన్ పోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయన వెంట పోర్టు ఎండీ చింతా శశిధర్ ఉన్నారు. పోర్టు సీఈవో అనిల్ ఎండ్లూరి, జేసీ రేఖారాణి, పోర్టు సిబ్బంది సచిన్‌కు ఘన స్వాగతం పలికారు.
అంతకుముందు హెలికాప్టర్ ద్వారా 15 నిమిషాల పాటు పోర్టును ఏరియల్ వ్యూలో సచిన్ వీక్షించారు. అనంతరం సీవీఆర్ ఫౌండేషన్ ఆంగ్ల మీడియం పాఠశాల విద్యార్థులను పలకరించి వారితో కరచాలనం చేశారు. సాయంత్రం పోర్టు యాజమాన్యం ఏర్పాటు చేసిన ప్రత్యేక బోట్‌లో సముద్ర విహారం చేశారు. చివరగా పోర్టు అతిథి గృహానికి చేరుకుని జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కొద్దిసేపు మాట్లాడారు. శనివారం రాత్రి పోర్టు అతిథిగృహంలోనే సచిన్ బస చేయనున్నారు.
సచిన్ జిల్లా అంబాసిడర్
సచిన్ ఆదివారం పర్యటన కోసం పుట్టంరాజు కండ్రిగకు వెళ్లి ఏర్పాట్లను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ పరిశీలించారు. సచిన్‌ను జిల్లా అంబాసిడర్‌గా మంత్రి అభివర్ణించారు. సచిన్ స్ఫూర్తితో ప్రజాప్రతినిధులు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు.
సచిన్ దత్తత తీసుకున్న పీఆర్ కండ్రిగలో మౌలిక వసతులు, పక్కా ఇళ్లు వంటి వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, మరో ఏడాదిలో ఈ పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను సచిన్ తన ఎంపీ నిధుల నుంచి కేటాయిస్తారని చెప్పారు.అంతర్జాతీయ క్రికెట్‌లోకి సచిన్ అరంగేట్రం చేసి శనివారంతో 25 ఏళ్లు నిండగా, ఆదివారంతో సచిన్ క్రికెట్ రిటైర్‌మెంట్‌కు ఏడాది నిండుతుంది.












Click it and Unblock the Notifications