ఎరుపు టూ కాషాయం-ఒకటే గొంతు-విపక్షాలపై సజ్జల ఫైర్- స్క్రిప్ట్ టీడీపీది, మాటలు బీజేపీవంటూ
ఏపీలో విపక్షాలు వ్యవహరిస్తున్న తీరుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా టీడీపీ, బీజేపీ సఖ్యత, బీజేపీలో ఉన్న మాజీ టీడీపీ ఎంపీలపై సజ్జల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కన్నుసన్నల్లోనే విపక్ష రాజకీయం నడుస్తోందంటూ సజ్జల వ్యాఖ్యానించారు.
నిన్న విజయవాడలో ఒక ప్రహసనం జరిగిందని, తెలుగుదేశం పార్టీకి అనుబంధ సభలాగా భారతీయ జనతా పార్టీ సభ జరిగిందని, దానికి ప్రజాగ్రహ సభ అని పేరు పెట్టారని సజ్జల అన్నారు. వాళ్లు ప్రజల్లో లేరని, ప్రజల భావోద్వేగాలు ఎలా ఉన్నాయో కూడా తెలియదన్నారు. అంతకు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టి మాట్లాడేవారు. అలాంటివాళ్లు బహిరంగ సభ పెట్టాలనుకోవడం అనేది వాళ్ల ఆలోచన అనుకోవడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు ఎజెండాలో భాగంగానే ఈ సభ పెట్టారన్నారు. వాళ్లు ఏదైతే అనాలనుకుంటున్నారో దానికి ఇంకో గొంతు కావాలి కాబట్టి, గతంలో సివిల్ సొసైటీ పేరుతో పదిరకాల ఇండివిడ్యూవల్స్‌ను తీసుకొచ్చి, పదిరకాల టీవీ డిబేట్లలో విశ్లేషకులుగా పెట్టి రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటని సజ్జల ఆరోపించారు. అలాంటివారిని ప్రజలంతా గమనించే ఉంటారన్నారు.

వీళ్ళ అందరి టార్గెట్ ఒకటేనని సజ్జల తెలిపారు. ఎరుపులో ఒక పార్టీ సీపీఐ నుంచి.. కాషాయ పార్టీ వరకూ అంతా ఒకటే తాను అని అన్నారు. టీడీపీ=బీజేపీ=కాంగ్రెస్=సీపీఐ=జనసేన. అమరావతి రైతుల పాదయాత్ర పేరుతో, న్యాయస్థానం నుంచి దేవస్థానం అని 400మందితో పాదయాత్ర పేరుతో వందకోట్లు వసూలు చేసి తిరుపతి చేరుకుని అక్కడ సభలో వీరిందరు కలిసినప్పుడు ఫర్‌ఫెక్ట్ పిక్చర్స్ వచ్చిందన్నారు. అది ఏ కారణం కోసం అనేది చూస్తే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లు అయిందన్నారు. మొత్తం అందరూ కలిసి ఒకటే స్టాంప్... ఒకటే గొంతు.. అదే "జగన్ మోహన్ రెడ్డిగారిది రాక్షస పాలన. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు" అని వరుసపెట్టి స్లోగన్స్ ఇచ్చారని సజ్జల విమర్శించారు.
బీజేపీ నేత సునీల్ థియోదర్ ట్వీట్స్ అన్నీ పచ్చి అబద్ధపు కూతలే. రాష్ట్రమంతా ఎక్కడ చూసినా మత మార్పిడులే అని బీజేపీ అంటే.. రెండోరోజు జనసేన ఎత్తుకుంటుంది. మధ్యాహ్నానికి ఇదే విషయాన్ని సీపీఐ రామకృష్ణ మొదలుపెడతారు. ఒకోరోజు పాత్ర మారొచ్చు. ఈ మూడు పార్టీలూ ఒక తానులో ముక్కలుగా తయారయ్యాయి. గతంలో చలసాని శ్రీనివాస్, గరుడ పురాణం శివాజీ మాదిరిగా. .ఒక్కొక్కరుగా ఉంటే ఇప్పుడు పార్టీలు ఆ పాత్రను పోషిస్తున్నాయిని సజ్జల ఆరోపించారు.
ఇంత పెద్ద జాతీయ పార్టీ అయిన బీజేపీ, జాతీయ స్థాయిలో కాకుండా, ఈ రాష్ట్రంలోకి వచ్చేసరికి ప్రాంతీయ పార్టీకి అనుగుణంగా పనిచేయడం బహుశా దేశంలోనే తొలిసారేమోనని సజ్జల అన్నారు. చంద్రబాబు నాయుడు అనే దుష్టశక్తి ఎత్తుగడలు, మ్యానిప్లేషన్స్‌లో భాగంగా, తన గేమ్‌లో ప్రతి ఒక్కరినీ పావులాగా వాడుకోగలిగిన, రాజకీయాల్లో మాయల పకీరు లాంటి బాబు ఎజెండాను పట్టుకుని సభ పెట్టడం చూస్తే జాలి కలిగిస్తోందన్నారు. అందుకే బీజేపీ.. టీడీపీ అనుబంధ విభాగంలాగా పనిచేస్తోందని అనాల్సి వచ్చిందని సజ్జల తెలిపారు.
రాజ్యాంగాన్ని అవమానించేలా టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్... బీజేపీ అఫిషియల్ ఎంపీలుగా వ్యవహరిస్తుండటం, వారిని మీడియాతో సహా అంతా బీజేపీ ఎంపీలుగా గుర్తించేసి, యాక్సెప్టెన్స్ ఆ లెవల్‌కు తీసుకువెళ్ళారని సజ్జల విమర్శించారు. టీడీపీ పొరపాటున కూడా వారిపై అనర్హత వేటు వేయమని అడగదని సజ్జల తెలిపారు. సంప్రదాయంగా అయినా వారిపై అనర్హత వేటు వేయాలని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. రాజ్యసభ చైర్మన్ గారు అంతకు ముందు పార్టీ ఫిరాయించి వారిపై ఒక్కరోజులోనే అనర్హత వేటు వేసిన ఆయన.. ఈ ఇద్దరిపై అనర్హత వేటు ఎందుకు వేయడం లేదన్నారు.
గతంలో ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్న బీజేపీ.. ఆ తర్వాత 2017లో హోదా లేదు ప్యాకేజీ ముద్దు అందని సజ్జల గుర్తుచేశారుచ ఆ ప్యాకేజీ ముద్దు అన్న వీళ్ళు ఆ రోజు హోదా అడగలేదు. ప్యాకేజీనే ముద్దు అన్నారు. మాకేమీ బాధ్యత అని ఇవాళ బీజేపీ వాళ్లు అంటున్నారు. ఇక బీజేపీ మిత్రుడు అయిన పవన్ కల్యాణ్ పోరాడాల్సింది మీరు అంటున్నారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ విషయంలోనూ ఇదే జరిగిందన్నారు. ప్రైవేటీకరణ తప్పదని వాళ్లే అంటారు. పైపెచ్చు వైయస్సార్ సీపీ ఎంపీలు ఏంచేస్తున్నారని ప్రశ్నిస్తుంటారు. ఇవ్వాల్సింది మీరు, నచ్చచెప్పాల్సింది మీరు.. మాపై విమర్శలు చేస్తూ బీజేపీ రాజకీయాలు చేస్తుందా? లేక టీడీపీ తరపున బీజేపీలో పనిచేస్తున్నారా? అన్నది చెప్పాలి. దీనికి టీడీపీ అయినా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా అని నిలదీశారు.












Click it and Unblock the Notifications