జగన్ ను వేధించిన పార్టీతోనా ? వైఎస్ షర్మిలపై సజ్జల విసుర్లు- అయినా..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (telangana assembly election 2023) కాంగ్రెస్ పార్టీకి (congress party) మద్దతివ్వాలన్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (ys sharmila) నిర్ణయం ఇప్పుడు కలకలం రేపుతోంది. షర్మిల మద్దతుతో కాంగ్రెస్ కు వచ్చే లాభం, బీఆర్ఎస్ కు వచ్చే నష్టం ఏంటో తేలకపోయినా .. ఈ నిర్ణయం మాత్రం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి షర్మిల నిర్ణయంపై స్పందించారు.
కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్టీపీ ఛీఫ్ వైఎస్ షర్మిల మద్దతివ్వడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ స్పందించారు. జగన్మోహన్‌రెడ్డిని ఏ పార్టీ వేధించి అక్రమ కేసులు పెట్టిందో ఆ పార్టీతో ఇప్పుడు షర్మిల జత కలిశారని సజ్జల ఆరోపించారు. షర్మిల ఓ పార్టీకి అధ్యక్షురాలని, ఆమె నిర్ణయాలు ఆవిడ ఇష్టమని సజ్జల వ్యాఖ్యానించారు. తమకు మాత్రం ఈ రాష్ట్రానికి చెందిన విషయాలే ముఖ్యమన్నారు.

కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కుటుంబాన్ని వేధించిందని, ఇబ్బందులు పెట్టిందని అందరికీ తెలుసని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. జగన్‌పై అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టిందన్నారు. చంద్రబాబుపై ఎందుకు తక్కువ కేసులు పెట్టారని ఆమె అడగాలన్నారు. తద్వారా వైఎస్ షర్మిల నిర్ణయం తమకు నచ్చలేదని వైసీపీ పరోక్షంగా చెప్పినట్లయింది.
మరోవైపు ఏపీలో అంశాలపైనా సజ్జల మాట్లాడారు.
ఇసుకలో ఉచితంగా మార్కెట్, లోడింగ్, ట్రాన్స్‌పోర్ట్ మాత్రమే దొరికిందా చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని సజ్జల ప్రశ్నించారు. ఉచితంగా అంటే క్రేన్ లు , బోట్లతో ఎవరు తోడారని అడిగారు. ఎన్‌జీటీ ఎందుకు ఫైన్ విధించిందని నిలదీశారు. మద్యంలో కూడా ప్రివిలేజ్ కేస్ వేసి తర్వాత దాన్ని తీసేస్తారన్నారు. ఈ వ్యవహారంలో ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేస్ పెట్టారన్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కేవలం చంద్రబాబు ఫ్యామిలీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారని, ఆమె కూడా వారం పది రోజుల నుంచే ఇలా మాట్లాడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.












Click it and Unblock the Notifications