చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాకూడదు: ఇదే తన కోరిక అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాకూడదని సజ్జల వ్యాఖ్యానించారు. ఇదే తన కోరిక అని అన్నారు. చంద్రబాబు లాంటి వాళ్లకు దేవతానుగ్రహం ఉండకూడదని తాను కోరుకుంటున్నానని సజ్జల అన్నారు.
పోలవరం ఆలస్యానికి చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలే కారణమని ఆరోపించారు.
పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని సజ్జల మండిపడ్డారు. చంద్రబాబును జనాలు ఇన్నాళ్లు భరిస్తూ వస్తున్నారని సజ్జల అన్నారు. రాష్ట్రంలో సంచలనం రేపిన ఒంగోలు కారు ఘటనపై స్పందిస్తూ.. దీనిపై సీఎం జగన్ వెంటనే స్పందించారని సజ్జల తెలిపారు. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. కింద స్థాయి అధికారి చేసిన తప్పునకు మొత్తం ప్రభుత్వాన్నే తప్పు పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు మతి భ్రమించిందని, ప్రస్తుతం ఆయన సంధికాలంలో ఉన్నారని ఎద్దేవా చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.

కాగా, ఒంగోలు ఘటన విషయానికొస్తే.. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వేముల శ్రీనివాస్ కుటుంబం తిరుమలకు బయలుదేరింది. ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు పిల్లలు ఇన్నోవా కారులో తిరుపతికి బయలుదేరారు. బుధవారం రాత్రి ఒంగోలు పట్టణం చేరుకున్నారు. పాత మార్కెట్ సెంటర్ లోని హోటల్ దగ్గర శ్రీనివాస్ కుటుంబం టిఫిన్ చేస్తున్న సమయంలో కానిస్టేబుల్ తిరుపతిరెడ్డి, ఆర్టీఏ సిబ్బంది అక్కడికి వచ్చారు.
సీఎం పర్యటన నేపథ్యంలో వాహనం కావాలని అడిగారు. తాము తిరుపతికి వెళ్తున్నామని, వాహనం ఇవ్వడం కుదరదని వారు చెప్పినా వినిపించుకోలేదు. డ్రైవర్‌తో సహా వాహనాన్ని తీసుకెళ్లారు. దీంతో తిరుమల వెళ్లాల్సిన శ్రీనివాస్ కుటుంబం ఒంగోలులోనే చిక్కుకుంది. చివరకు మరో వాహనం తెప్పించుకుని వారు తిరుమలకు చేరుకున్నారు.
ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. సీఎం జగన్ పర్యటన కోసం అధికారులు సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం దారుణమన్నారు. సీఎం కాన్వాయ్ కోసం పిల్లాపాపలతో తిరుపతి వెళుతున్న ఓ కుటుంబాన్ని రోడ్డుపైనే వదిలేసి కారును లాక్కెళ్లడంపై చంద్రబాబు మండిపడ్డారు.
ప్రజాసేవ చేయాల్సిన ముఖ్యమంత్రి ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నించారు. సీఎం కాన్వాయ్ కోసం ఆర్టీఏ అధికారులు సామాన్య ప్రజల కార్లను లాక్కెళ్లడం రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు నిదర్శనమని చంద్రబాబు మండిపడ్డారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా జగన్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వాహనాలు లేవా? ప్రజల వాహనాలు తీసుకెళ్తారా? అని ప్రశ్నించారు. కాగా, ఈ ఘటనపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ కారును తీసుకెళ్లిన సిబ్బందిపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హోంగార్డు పి.తిరుపతిరెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సంధ్యను అధికారులు సస్పెండ్ చేశారు.












Click it and Unblock the Notifications