రెండుసార్లు పవన్ చంద్రబాబునే మోశారు: అమిత్ షా పైనా సజ్జల సెటైర్లు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న మొన్నటి దాకా టిడిపి వైసిపి మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగితే, ఇక తాజాగా ఈ పోరాటంలో జనసేన, బీజేపీ కూడా చేరుతున్నాయి. ఒకపక్క వారాహి యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలోకి వెళుతూ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉంటే, బీజేపీ అగ్రనేతలు ఏపీలో తాజాగా పర్యటించి మాట్లాడిన బహిరంగ సభలో వైసీపీ పాలన అవినీతి పాలన అంటూ విరుచుకుపడ్డారు.
దేశంలో ఏపీ భాగం కాదన్నట్టు అమిత్ షా మాట్లాడారని సజ్జల మండిపడ్డారు. గత రెండు సార్లు కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబునే మోశారు. ఇప్పుడు మరోసారి పవన్ చంద్రబాబు కోసమే పని చేస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. బీసీ కులాల ఆకాంక్షలను నెరవేర్చటం కోసం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఆర్థికంగా కూడా వారికి జగన్ సర్కార్ చేయూతనిస్తుందని స్పష్టం చేశారు.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా, చెప్పినవి కూడా అమలు చేశారని తెలిపారు. జగన్ అధికారంలోకి రాకముందు బిసి డిక్లరేషన్ చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకున్నప్పటికీ, రాష్ట్రంలో జనాభా ప్రకారం అందరికీ న్యాయం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
ఈ నాలుగేళ్ల కాలంలో సామాజిక న్యాయం ఎంతో వేగంగా జరిగిందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లోనూ బలమైన నాయకత్వం రావటం ఖాయమని 175 కి 175 సీట్లు దక్కించుకునేలా అడుగులు వేద్దామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మరింత మెరుగైన మెజారిటీతో సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు అంటూ వ్యాఖ్యలు చేశారు.
సామాజిక న్యాయం అమలు కాకపోతే సమాజానికి మంచిది కాదని, ఎప్పటికైనా తిరుగుబాటు వస్తుందని, అందుకే అందరి చేతుల్లో అధికారం సమానంగా ఉండాలన్న దిశగా సీఎం జగన్ అడుగులు వేశారని పేర్కొన్నారు. విద్యార్థుల చదువుకు పెద్దపీట వేస్తున్నామని, మహిళా సాధికారతకు సీఎం జగన్ పట్టం కడుతున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications