అబద్దాలు చెప్పే పోటీలో చంద్రబాబుకే గిన్నిస్ రికార్డ్: టీడీపీ మ్యానిఫెస్టోపై సజ్జల సెటైర్లు!!
టిడిపి మహానాడులో చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోపై ఇప్పుడు ఏపీలో దుమారం రేగింది. చంద్రబాబు మ్యానిఫెస్టోఫై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు విడుదల చేసిన టిడిపి మేనిఫెస్టోపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట అని పేర్కొన్న సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నిద్రలో లేపినా అవే అబద్ధాలు చెబుతారు అంటూ అసహనం వ్యక్తం చేశారు.
చంద్రబాబు తన పాలనలో రాష్ట్రంలో అవినీతి, అరాచకాలలో రికార్డు సృష్టించాడని, పోతూ పోతూ రెండు లక్షల కోట్ల అప్పు చేసి పెట్టి వెళ్లాడని విమర్శలు గుప్పించారు.చంద్రబాబు నాయకుడు కాదని ఆయన మానిప్యులేటర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పే పోటీ పెడితే చంద్రబాబుకే గిన్నిస్ రికార్డు వస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు.

చంద్రబాబు మాటలు కొత్త బిచ్చగాడిలా, మొదటిసారి మేకప్ వేసుకున్న నటుడిలా ఉన్నాయంటూ సెటైర్లు వేశారు. టిడిపి మేనిఫెస్టో హామీలు దరిద్రంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తాము అమలు చేస్తున్న హామీలను కూడా చంద్రబాబు కాపీ కొట్టారని మండిపడ్డారు. జగన్ ఒక మంచి ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
గతంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేదని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కనిపిస్తుందని, పద్నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు ఎక్కడ గాడిదలు కాశాడని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అవకాశం ఇచ్చినప్పుడు చంద్రబాబు చేసిన ఒక మంచి పని అయినా చెప్పుకోవడానికి ఉందా అంటూ ప్రశ్నించారు.
అప్పుడు ఏమి చేయలేక పోయిన చంద్రబాబు, ఇప్పుడు ఇన్ని హామీలు ఇచ్చినంత మాత్రాన చేస్తారా? ప్రజలు వాటిని నమ్ముతారా ? అంటూ ప్రశ్నించారు. మా ప్రభుత్వంలో ఎన్నికల తాయిలాలు ఉండవని, 2024, 2029 ఎన్నికలకైనా జగన్ లాగా చిత్తశుద్ధి ఉన్న నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications