రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలి - లేదంటే సరిదిద్దాలి: సజ్జల..!!
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కుదిరితే మళ్లీ ఏపీ ఉమ్మడిగా ఉండాలన్నదే తమ పార్టీ..తమ ప్రభుత్వ విధానమని వ్యాఖ్యానించారు.రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచి చివరి క్షణం వరకు వైసీపీ చిత్తశుద్ధితో పోరాటం చేసిందని గుర్తుచేశారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాఖ్యలు అసంబద్ధమైనవన్నారు. విభజన సమయంలో అన్యాయం చేసింది ఉండవల్లి అరుణ్‌కుమార్ ఉన్న కాంగ్రెస్ పార్టీ, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, తెలుగుదేశం పార్టీలే అని సజ్జల చెప్పుకొచ్చారు.

విభజనకు వ్యతిరేకంగా కోర్టుల్లో
ఉండవల్లి అరుణ్‌కుమార్ పిటిషన్ ఆధారంగా తిరిగి రెండు రాష్ట్రాలు కలిపి ఉంచాలనే సుప్రీంకోర్టు చెబితే దానిని వైసీపీ స్వాగతిస్తుందన్నారు. విభజనకు వ్యతిరేకంగా కోర్టుల్లో తమ వాదనలు బలంగా వినిపిస్తామన్నారు. రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలని.. లేదంటే సరిదిద్దాలని కోరుతామని సజ్జల చెప్పుకొచ్చారు. విభజన జరిగిన తీరుపైనే కేసు వేశారని, హామీల అమలు కోసం కాదని.. విభజన హామీల అమలు కోసం ఏపీ ప్రభుత్వం పోరాడుతోందని సజ్జల స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలు కలిసే అవకాశాన్నీ ఏపీ సర్కార్ ఉపయోగించుకుంటుందని, ఇరు రాష్ట్రాలు కలిసుండాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తే అంతకంటే కావాల్సిందేముందని ప్రశ్నించారు. సీఎం వైయస్ జగన్‌ది సింగిల్ అండ్ స్ట్రైట్ లైన్ అని చెప్పారు. చాలా పారదర్శకంగా ముక్కుసూటిగా ఉండే తత్వంమని వివరించారు.

ఉండవల్లి ఉద్దేశ పర్వకంగానే
దురదృష్టకరంగా, అన్యాయంగా విభజనకు గురయ్యామనే భావన అందరిలోనూ ఉందని చెప్పుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రం ఉంటే తమ పార్టీ అధికారంలోకి వచ్చేదని...అది ప్రజలకు కూడా తెలుసుని చెప్పారు. ఎప్పుడైనా సరే కుదిరితే మళ్లీ ఉమ్మడి రాష్ట్రానికే వైసీపీ పార్టీ - ప్రభుత్వం ఓటు వేస్తుందన్నారు. ఏ వేదిక దొరికినా మళ్లీ కలవడానికి మొగ్గుచూపుతూ తమ పార్టీ ప్రభుత్వం వాదనలు వినిపిస్తుందన్నారు. విభజన జరిగి ఎనిమిది సంవత్సరాలు గడిచింది.. పెండింగ్ అంశాలను సాధించే విషయంలోనూ వైయస్‌ఆర్ సీపీ ముందుందని చెప్పారు. నాడు విభజనకు వ్యతిరేకంగా ఫైట్ చేశామన్నారు. ఉండవల్లి అరుణ్‌కుమార్ మాటల్లో అసంబద్ధమైనవిగా అనిపించాయని చెప్పుకొచ్చారు. పనిగట్టుకొని సీఎం వైయస్ జగన్ వైపు చూపిస్తున్నట్టుగా అనిపిస్తుందని వ్యాఖ్యానించారు.
సజ్జల వ్యాఖ్యల పై మాజీ ఎంపీ పొన్నం అభ్యంతరం
సజ్జల వ్యాఖ్యల పైన తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పందించారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలవడం అనేది కల.. నిజం కాదని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు ప్రకటనను ఖండిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలోనూ ఏపీ నేతలు ఇదే రకంగా వ్యవహరించాని చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన పూర్తిగా పద్దతి ప్రకారమే జరిగిందన్నారు. తిరిగి రెండు రాష్ట్రాలు కలవటం అనేది సాధ్యపడే విషయం కాదని పొన్నం వ్యాఖ్యానించారు.