అవినాష్ సీబీఐ విచారణపై సజ్జల కీలక వ్యాఖ్యలు..!
ఏపీలో సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఇవాళ విచారణకు హాజరు కావాలని సీబీఐ కోరినా చివరి నిమిషంలో ఆయన హాజరు కాకుండా పులివెందుల బయలుదేరారు. దీంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీబీఐ అధికారులు ఆయన్ను కర్నూలు వరకూ వెంటాడి ఆ తర్వాత వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో ఏం జరిగిందనే దానిపై వైసీపీ నేత సజ్జల స్పందించారు.
సీబీఐ విచారణకు హాజరయ్యే ఉద్దేశంతోనే అవినాష్ రెడ్డి హైదరాబాద్ వచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని సజ్జల వెల్లడించారు. కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో వార్తలు ఇస్తున్నాయని మండిపడ్డారు. తల్లి అనారోగ్యం గురించి అవినాష్.. సీబీఐకి సమాచారం ఇచ్చే ఉంటారని సజ్జల పేర్కొన్నారు.
సీబీఐ విచారణకు అవినాష్ హాజరుకాకపోవడంపైతప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కొన్ని మీడియా సంస్ధలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏదో జరిగిపోతుందని కొందరు హడావుడి చేస్తున్నారని, తల్లికి సీరియస్‌గా ఉందనే సీబీఐ విచారణకు అవినాష్ హాజరు కాలేదని సజ్జల వెల్లడించారు. మీడియా వెంట పడటం ఏంటో తనకు అర్థం కావడం లేదన్నారు. వివేకా హత్యలో అవినాష్ పాత్ర ఉంటేఆనాడు సీఎంగా ఉన్న చంద్రబాబు వదిలేవాడా..? అని ఆయన ప్రశ్నించారు. 5 సార్లు సీబీఐ ముందు హాజరైన అవినాష్ ఇప్పుడెందుకు తప్పించుకోవాలని అనుకుంటాడని అడిగారు.
సీబీఐ ఎదుటకు ఇవాళ కాకపోతే రేపయినా వెళ్లాల్సిందేగా అని అవినాష్ రెడ్డి విచారణపై సజ్జల వ్యాఖ్యానించారు. అసలు హత్య చేశానన్నవాడు రోడ్డు మీద తిరుగుతున్నాడన్నారు. ఒక ఎంపీని మాత్రం వెంటాడుతున్నారని ఆక్షేపించారు. ఒక వేళ ఎక్స్ ట్రీమ్‌గా వ్యవహరించినా ఫేస్ చేయడానికి సిద్దంగా ఉన్నాడన్నారు. తద్వారా సీబీఐ విచారణ నుంచి అవినాష్ తప్పించుకోవడం లేదని సజ్జల స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications