• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డ్రామాలు తారస్థాయికి.: ఢిల్లీ లిక్కర్ స్కాంపై సజ్జల

|
Google Oneindia TeluguNews

అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడుతూ.. తెలుగుదేశం, జనసేన పార్టీల అసత్య ప్రచారాలను తిప్పికొట్టారు.

అప్పులోళ్ల మాదిరిగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్: సజ్జల

అప్పులోళ్ల మాదిరిగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్: సజ్జల

విశాఖపట్నంలో మొదలైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డ్రామా ఇప్పటంలో తారస్థాయికి చేరిందని విమర్శించారు. ఇద్దరూ కలిసి ఒక ప్రణాళికతో విశాఖ ఎయిర్ పోర్ట్‌లో మంత్రులపై దాడి చేయించారని, ఆ తర్వాత విజయవాడ నోవాటెల్ లో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో కలిసి మంతనాలు చేశారని విమర్శించారు. ఇప్పుడు ఇప్పటానికి అప్పులోళ్లు వచ్చి వెళ్తున్నట్లుగా వాయిదాల పద్ధతిలో వస్తూ రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్లాన్ చేస్తే, పవన్ అమలు చేస్తారని, ఇప్పటంలో ఎక్కడా ఇళ్ల కూల్చివేత జరగకపోయినా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

టీడీపీపై పవన్ కళ్యాణ్ అప్పుడలా అన్నారన్న సజ్జల

టీడీపీపై పవన్ కళ్యాణ్ అప్పుడలా అన్నారన్న సజ్జల

గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకోనని, ఓట్లు చీల్చనని ప్రతిజ్ఞ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వస్తే టీడీపీతో పొత్తు పెట్టుకుంటానని చెబుతున్నారని సజ్జల మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రజాస్వామ్యం నాశనమైందని చూపేందుకు అనేక చోట్ల వారే సమస్యలు సృష్టించి, తిరిగి వైఎస్సార్సీపీ నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు టీడీపీ, జేఎస్‌పీ అధికారంలోకి రావాలని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అయితే వారు ప్రచారం చేస్తున్నది తప్పుడు సమాచారమని తాము ఆధారాలతో స్పష్టం చేస్తున్నామని సజ్జల వివరించారు. చంద్రబాబు, పవన్‌ల కలయికకు హేతుబద్ధమైన కారణాలేంటో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని సజ్జల డిమాండ్ చేశారు. అవాస్తవాలను ప్రచారం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికంటూ వారు చెబుతున్న మాటలను ప్రజలు విశ్వసించబోరన్నారు. అధికారంలోకి రావడానికి ఆయన చేసే చీప్ ట్రిక్స్ ను ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. ఇప్పటంలో పవన్ కళ్యాణ్ సృష్టించిన డ్రామా చూసి షాక్ అయ్యామని, అతడి ప్రవర్తన, కారుపై కూర్చున్న తీరు, ఆవేశంగా చేసే ప్రసంగం అవన్నీ సమస్యాత్మకంగా ఉన్నాయన్నారు సజ్జల.

పవన్ సభకి స్థలమిచ్చిన ఎవ్వరి ఇళ్లు కూల్చలేదన్న సజ్జల

పవన్ సభకి స్థలమిచ్చిన ఎవ్వరి ఇళ్లు కూల్చలేదన్న సజ్జల

జనసేన సభకు స్థలాలిచ్చిన వారెవ్వరి ఇళ్లు కూల్చలేదని, అసలు ఇళ్లే పడగొట్టలేదని సజ్జల స్పష్టం చేశారు. రోడ్డు విస్తరణ కోసం ప్రహరీలను మాత్రమే తొలగించాల్సి వచ్చిందని, వాటిలో వైసీపీ వాళ్ల ఇళ్ల ప్రహరీలు కూడా ఉన్నాయని తెలిపారు. టీడీపీ, జనసేన కావాలనే ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని వివరించారు. ఇప్పటం ఘటనపై విడతల వారీగా స్క్రిప్ట్‌ను రూపొందించి, నిజం కాని కథను రచించి, దానితో రాజకీయ మైలేజ్ పొందాలనుకుంటున్నారని, లేని సమస్యలను సృష్టించి విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.

ఢిల్లీ స్కాంతో సంబంధం లేదన్న సజ్జల

ఢిల్లీ స్కాంతో సంబంధం లేదన్న సజ్జల

ప్రభుత్వం ఇప్పటికే ఎంతో చేస్తోందని, ఇంకా ఏమైనా చేయాలంటే సూచనలు అందిస్తే.. చేయడానికి తామెప్పుడూ సిద్ధమని సజ్జల హితవు పలికారు. డీబీటీ పథకాల ద్వారా సంక్షేమం, దిశ యాప్ ద్వారా భద్రత అందిస్తున్నామని, గత ప్రభుత్వం అలా చేయడంలో విఫలమైనందునే ప్రజలు ఓట్లతో శిక్షించారని గుర్తు చేశారు. ఎల్లో మీడియా ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తోందని, ప్రతి పథకాన్ని 70-80% సంతృప్తి శాతంతో పూర్తి చేశామని వివరించారు. కానీ, ఎల్లో మీడియా మాత్రం ప్రభుత్వం చేయని 20 శాతాన్నే చూపిస్తూ వ్యతిరేక ప్రచారానికి దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోకి వచ్చాక రెండేళ్లపాటు కోవిడ్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని, వాటిని అధిగమించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని చెప్పారు. ప్రజలు దాన్ని గుర్తిస్తుంటే.. ఎల్లో మీడియా మాత్రం కళ్లు మూసుకుపోయి చూడలేకపోతోందని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. ఢిల్లీ స్కాంలో విజయసాయి రెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నారు.

పవన్‌తో కలిసి చంద్రబాబు కుట్రలంటూ సజ్జల

పవన్‌తో కలిసి చంద్రబాబు కుట్రలంటూ సజ్జల

2014లో కలిసి పోటీ చేసినప్పుడు లబ్ధిదారులకు 3 సెంట్ల భూమి ఇస్తామన్న హామీ గుర్తుందా? మేనిఫెస్టోలో పెట్టిన హామీపై పీకే ఎప్పుడైనా చంద్ర బాబుని ప్రశ్నించారా? అని సజ్జల నిలదీశారు. వైఎస్సార్ సీపీ ప్రజా ప్రభుత్వం వచ్చాక 71 వేల ఎకరాల్లో 17 వేల లే అవుట్‌లలో 31 లక్షల పట్టాలను సీఎం జగన్ పేదలకు పంపిణీ చేశారని, అది కనీసం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ భూమి విలువ రూ. 56 వేల కోట్లుంటే ఇప్పుడు అక్కడ ఇళ్లు నిర్మించి ఇవ్వడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలు పెరిగి, రూ. 3 లక్షల కోట్ల సంపదను ఉత్పత్తి చేస్తుందని వివరించారు. పేదల కోసం సంపద సృష్టించింది ఎవరో చూడాలని, దుష్ప్రచారం చేస్తున్న బాబు జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేశారా అని నిలదీశారు. పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేయడం బాబుకు అలవాటని, ఏదో కుంభకోణం జరుగుతోందని చెబుతారని, తిరిగి పేదలకు భూమి లేదంటూ బురద జల్లే ప్రయత్నం చేస్తారని మండిపడ్డారు. దేశంలో ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్న దాఖలాలు లేవని, ఇంతటి సంక్షేమం సీఎం జగన్ ప్రభుత్వంతో తప్ప మరే ప్రభుత్వంతోనూ సాధ్యం కాదని స్పష్టం చేశారు. కోవిడ్‌ పరిస్థితులు ఉన్నా ఏ ఒక్క పథకాన్ని వదిలేయకుండా అమలు చేస్తున్నామన్నారు. ప్రతిపక్ష టీడీపీ దత్తపుత్రుడు పవన్ తో కలిసి రాజకీయ మైలేజ్ కోసం కట్టుకథలను ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుట్రలకు, దుష్ప్రచారానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే సమాధానం చెప్తారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.

English summary
Sajjala Ramakrishna reddy slams pawan kalyan and chandrababu naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X