వైసీపీలో అభ్యర్దుల మార్పు - సజ్జల క్లారిటీ..!!
ఏపీ ఎన్నికల రాజకీయం కీలక దశకు చేరుకుంది. గెలుపును ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్య నేతల ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఈ సమయంలోనే అటు కూటమి, ఇటు వైసీపీలో అభ్యర్దుల మార్పు పైన చర్చ మొదలైంది. బీజేపీ - టీడీపీ పార్టీల అభ్యర్దుల మార్పు పైన అంచనాలుమొదలయ్యాయి. ఇదే సమయంలో వైసీపీలో అభ్యర్దుల మార్పు పైన ప్రచారం సాగుతోంది. ఈ అంశం పైన వైసీపీ ముఖ్య నేత సజ్జల స్పష్టత ఇచ్చారు.
అభ్యర్దుల మార్పుపై క్లారిటీ
వైసీపీలో అభ్యర్దుల మార్పు పైన కొన్ని నియోజకవర్గాలు -అభ్యర్దుల పేరుతో ప్రచారం సాగుతోంది. పార్టీలో నాలుగు నెలల కసరత్తు తరువాత అభ్యర్దులను ఖరారు చేసామని పార్టీ ముఖ్య నేత సజ్జల గుర్తు చేసారు. అభ్యర్దుల మార్పుకు అవకాశం లేదని చెప్పుకొచ్చారు. అదే విధంగా రాష్ట్రంలో నిష్పక్షపాక్షికంగా ఎన్నికలు జరిగితే వైసీపీ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని చెప్పారు. ఇప్పటికే ఓటర్ల మూడ్ స్పష్టంగా ఉందని సజ్జల విశ్లేషించారు. ఒంగోలులో టీడీపీ శ్రేణులే దాడులకు పాల్పడుతున్నారని వివరించారు. వైసీపీ కార్యకర్తల పైనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయన్నారు.

చంద్రబాబు మాట మార్చారు
ఒక్కప్పుడు వాలంటీర్లపై ఎన్నో ఆరోపణలు చేసిన చంద్రబాబు..ఇప్పుడు వారిని కొనసాగిస్తామంటున్నారన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని సజ్జల పేర్కొన్నారు. చంద్రబాబు రోజుకో మాట మారుస్తారని విమర్శించారు. 2014లో చేసిన మోసాన్నే చంద్రబాబు మళ్లీ చేస్తున్నారన్నారు. నాలుగు ఓట్ల కోసం చంద్రబాబు అబద్ధపు హామీలు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. వాలంటీర్లపై చంద్రబాబు, దత్తపుత్రుడు విషయం కక్కారన్నారు. ఇప్పుడు వాలంటీర్లపై ప్రేమ చూపిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్ల స్థానంలో జన్మభూమి కమిటీలు వస్తాయని సజ్జల చెప్పుకొచ్చారు.
ప్రజా తీర్పు ఏకపక్షం
వాలంటీర్ల స్థానంలో జన్మభూమి కమిటీల సభ్యులు ఉంటారన్నారు. జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే పథకాలు అందుతాయని చెప్పారు. చంద్రబాబు నైజం ప్రజలకు అర్థమైందన్నారు. గొడవలు వాళ్లు సృష్టించి తమపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవలేమని తెలిసే టీడీపీ గొడవలు సృష్టిస్తోందని సజ్జల ఆరోపించారు. రాష్ట్రంలో అన్నిప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ పైన ప్రజలు అభిమానం చూపిస్తున్నారని విశ్లేషించారు. వాలంటీర్లు రాజీనామా చేసి ప్రచారంలో పాల్గొంటే హక్కు ఎవరికీ లేదని సజ్జల తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications