వివేకా హత్యపై చంద్రబాబు జగన్నాటకం; సునీత, ఆమె భర్త పావులుగా.. సజ్జల సంచలనం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలపై వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని, ఒక వ్యవస్థను అడ్డంపెట్టుకుని వ్యవహరిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ కావాలని దుష్ప్రచారం చేస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు గుప్పించారు.

వివేకా కూతురు సునీతా రెడ్డి చంద్రబాబు చేతిలో పావుగా మారారు
వివేకా హత్య కేసులో రాజకీయ రంగు పులిమి విశృంఖలంగా వ్యవహరిస్తున్నారని, ఎంతగా బురద జల్లుతున్నా ఇంతకాలం ఓపికగా వ్యవహరించామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ కుట్ర ఇప్పుడు పరాకాష్టకు చేరింది అని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. వివేకానంద రెడ్డి సొంత కుటుంబ సభ్యులే ఆరోపణలు చేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు. వివేకా హత్య కేసు విచారణకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా సునీత రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని, సునీత చంద్రబాబు చేతిలో పావుగా మారారని అనుమానం వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.

ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్న నాటకం
వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి మాట్లాడిన తర్వాత తాము మౌనం వీడి తప్పడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తమ కుటుంబంలోని ఒక నాయకుడు వ్యక్తిగత జీవితం బయటకు రాకూడదనే ఇప్పటివరకు తాము నిగ్రహం పాటించాలి అని చెప్పుకొచ్చారు. జగన్ ను ఇరికించడం కోసం చంద్రబాబు ఆడుతున్న నాటకంలో సునీత, ఆమె భర్త పావులో, సహ పాత్రధారులో అర్థం కావడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా సునీతా రెడ్డి .. అందుకే ఇలా జరుగుతుందా?
వివేకా హత్య పై రోజుకో ఆరోపణలు చేస్తూ ఎల్లోమీడియా దిగజారుడు కథనాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కుట్రపూరితంగా వెనకుండి చంద్రబాబే నాటకమాడుతున్నారని ఇదంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతుందంటూ సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి పై కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారని, రాజకీయంగా ఎదుర్కోలేక వివేకా కుమార్తె సునీత రెడ్డిని, అల్లుడు రాజశేఖర్ రెడ్డిని కలుపుకొని చంద్రబాబు కుట్రకు తెరలేపారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వివేక కుమార్తెను ప్రచారం జరుగుతోందని, ఈ క్రమంలోనే చంద్రబాబు డైరెక్షన్లో సునీతారెడ్డి ఆరోపణలు చేస్తున్నట్లుగా అనుమానాలున్నాయని పేర్కొన్నారు.

పథకం ప్రకారం జగన్ పై దుష్ప్రచారం
ఆ పార్టీ లోకి వెళ్లాలంటే వెళ్లొచ్చు కానీ వ్యక్తిగత హననం సరికాదని సజ్జల రామకృష్ణారెడ్డి చురకలంటించారు. సి.బి.ఐ విచారణను కూడా ప్రభుత్వం స్వాగతించింది అని, తాము చంద్రబాబు లాగా సిబిఐకి ఏపీలో నో ఎంట్రీ అని చెప్పలేదని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఓ పథకం ప్రకారం జగన్ పై దుష్ప్రచారం చేస్తున్నారని ఎల్లో మీడియా సిగ్గూఎగ్గూ లేకుండా కథనాలను ప్రసారం చేస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏ మాత్రం ఆధారాలు లేకున్నా సునీత రెడ్డి చేస్తున్న ఆరోపణలు దారుణమని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications