జనం ఫిక్స్ అయ్యారు: మంత్రి రోజా
Roja: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ కోలాహలం నెలకొంది. ఇప్పటికే నగరాలు ఖాళీ అయ్యాయి. హైదరాబాదీయులు ఏపీ వైపు పరుగులు తీశారు. ఈ పండగను తమ ఆత్మీయుల మధ్య జరుపుకొంటోన్నారు. భోగీ మంటలు, సంక్రాంతి ముగ్గులతో పల్లెటూళ్లు సందడిగా మారాయి. సరికొత్త కళను సంతరించుకున్నాయి.
పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా.. ఈ తెల్లవారు జామున భోగీ వేడుకల్లో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నగరిలోని తన నివాసం వద్ద ఆమె కుటుంబ సభ్యులతో కలిసి భోగీ మంటలను వెలిగించారు. రాష్ట్ర ప్రజలకు భోగీ, సంక్రాంతి పండగ శుభాకాంక్షలను తెలిపారు. ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేశారు.

గ్రామాల్లో పాత వస్తువులు, సామాగ్రిని భోగి మంటల్లో వేసి తగులబెట్టడం ఆనవాయితీగా వస్తోందని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం- జనసేన పార్టీ కూటమిని రాష్ట్ర ప్రజలు అదే రీతిలో మంటల్లో పడేస్తారని అన్నారు. చెత్త పార్టీలు, వారి ఆలోచనలను, అమలు చేయని మేనిఫెస్టోను జనం భోగీ మంటల్లో వేసి కాల్చేస్తారని చెప్పారు.
ఈ రాష్ట్రానికి పట్టిన టీడీపీ-జనసేన అనే పీడను శాశ్వతంగా తొలగించడానికి జనం సిద్ధంగా ఉన్నారని రోజా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి పట్టం కట్టడం కోసం జనం ఎదురు చూస్తోన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఆయన పరిపాలనకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేస్తారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు నుంచే వైఎస్ జగన్.. అన్ని రకాల హామీలను నెరవేర్చుతూ వస్తోన్నారని, ఈ అయిదు సంవత్సరాల కాలంలో మేనిఫెస్టోను పక్కాగా అమలు చేశారని రోజా గుర్తు చేశారు. జగన్ అగైన్, వైసీపీ వన్స్ మోర్.. అని ప్రజలే చెబుతున్నారని, పాలనకు అడ్డంకిగా మారిన చెత్త పార్టీలను భోగి మంటల్లో తగులబెట్టడం ఖాయం అని అన్నారు.












Click it and Unblock the Notifications