ఉద్యోగులకు కూటమి ప్రభుత్వ సంక్రాంతి బొనాంజా.. రూ. 2653 కోట్ల నిధులు విడుదల
ఉద్యోగులు, వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు కూటమి ప్రభుత్వ సంక్రాంతి కానుక ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు చెల్లింపుల నిమిత్తం నిధులు విడుదల చేసినట్లు ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. నీరు-చెట్టు బిల్లులు సహా వివిధ వర్గాలకు ఊరటనిస్తూ బిల్లులను క్లియర్ చేసినట్లు తెలిపారు.
మొత్తంగా రూ. 2653 కోట్ల మేర ఉద్యోగులు డీఏ, డీఆర్ ఎరియర్స్, కాంట్రాక్టర్ల బిల్లులకు నిధులు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. పెండింగులో ఉన్న ఒక డీఏ, డీఆర్ ఎరియర్స్ నిమిత్తం రూ. 1100 కోట్లు విడుదల చేసింది. అలాగే పోలీసులకు ఇవ్వాల్సిన సరెండర్ లీవుల్లో రూ. 110 కోట్లు మంజూరు చేసింది. ఈఏపీ, నాబార్డు, సాస్కీ, సీఆర్ఐఎఫ్ పనుల నిమిత్తం రూ. 1243 కోట్ల విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇందులోనే నీరు-చెట్టు బిల్లుల నిమిత్తం సుమారు రూ. 40 కోట్లు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. అలాగే డీఏ, డీఆర్ ఎరియర్స్ చెల్లింపులతో 2.25 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులకు, 2.70 లక్షల మంది పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. సుమారు 55 వేల మంది పోలీసులకు సరెండర్ లీవుల చెల్లింపులు చేసింది. ఇక నీరు-చెట్టు సహా వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు చేపట్టడంతో దాదాపు 19 వేలకు పైగా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 5.70 లక్షల మందికి సంక్రాంతి సందర్భంగా బిల్లులు, బకాయిలు చెల్లింపులు జరిపింది కూటమి ప్రభుత్వం.












Click it and Unblock the Notifications