వైసీపీ సర్పంచ్ దారుణ హత్య: గొడ్డళ్లతో రాత్రిపూట నరికి చంపారు
అమరావతి: వైసీపీ మద్దతుతో గెలిచిన గ్రామ సర్పంచ్‌పై ప్రత్యర్ధులు అతి కిరాతంగా గొడ్డళ్లతో నరికి చంపిన సంఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు ఆ గ్రామం. ఆ గ్రామం పేరు సంతమాగులూరు. అయితే గత కొంతకాలంగా గ్రామంలో ఫ్యాక్షన్ కక్షలకు తెరపడి గ్రామస్తులు ప్రశాంతంగా జీవిస్తున్నారు.
ఆదివారం రాత్రి జరిగిన ఘటనతో ఆ గ్రామంలో మళ్లీ ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు కథనం ప్రకారం సంతమాగులూరు సర్పంచ్ గడ్డం వెంకటరెడ్డి(45) గ్రామంలో నిర్మిస్తున్న దేవాలయానికి ధ్వజస్తంభం కొనుగోలు చేసేందుకు పదిహేను రోజుల క్రితం తనతోపాటు నలుగురు గ్రామస్తులను తీసుకుని వెళ్లారు.
ఆదివారం రాత్రి ఇంటికి వచ్చిన ఆయన ఆరుబయట చెట్టు కింద రాంబాబు అనే వ్యక్తితో కలసి కూర్చుని ఏదో ముచ్చటిస్తున్నారు. ఈ సమయంలో కుటుంబసభ్యులంతా ఇంట్లో ఉన్నారు. ఇదే సరైన సమయమని అదును చూసుకుని అదే గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు వచ్చి వెంకటరెడ్డిపై దాడికి పాల్పడ్డారు.

ఆయన్ను గొడ్డళ్లతో విచక్షణారహితంగా నరికి చంపారు. ఈ దాడిలో సర్పంచ్ వెంకటరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. దాడి మధ్యలో అడ్డు వచ్చిన రాంబాబును సైతం పక్కకు ఈడ్చి పడేశారు. అయితే వచ్చినవారు ఎవరైంది గుర్తుపట్టలేకపోతున్నారు.
ఈ దాడి ఘటనపై సమాచారం అందుకున్న ఎస్సై రాఘవరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. వెంకటరెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గ్రామంలో వెంకటరెడ్డి సౌమ్యునిగా పేరుపొందారు.
గ్రామంలో మంచి నేతగా పేరు కూడా సంపాదించుకున్నారు. ఇటీవల ఈ గ్రామంలో మరో నాయకుడైన అట్లా చిన వెంకటరెడ్డి కుమారుని వివాహానికి హాజరైన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వెంకటరెడ్డి ఇంటికి వచ్చి మరీ పలకరించి వెళ్లారు.












Click it and Unblock the Notifications