టోకెన్లు లేకపోయినా శ్రీవారి దర్శనానికి వెళ్లొచ్చు
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులు బారులు తీరుతున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వేలసంఖ్యలో తరలి వస్తోన్నారు.
శుక్రవారం నాడు 61,142 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 19,736 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.15 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

నేటితో వైకుంఠ ద్వార దర్శనం ముగియబోతోంది. దీనికోసం జారీ చేసిన సర్వదర్శనం టోకెన్ల కోటా ఈ నెల 17వ తేదీ నాటికే పూర్తయింది. 20వ తేదీకి సంబంధించిన సర్వదర్శనం టోకెన్లను నేడు జారీ చేయట్లేదు టీటీడీ అధికారులు. అయినప్పటికీ- టోకెన్లు లేని భక్తులను 20వ తేదీ అంటే సోమవారం నాడు క్యూలైన్‌లో శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తారు.
రేపు తిరుమలలో శ్రీ కూరత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం శాస్త్రోక్తంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తోన్నారు. 23వ తేదీ నాటికి అధ్యయనోత్సవాలు కూడా ముగియబోతోన్నాయి. కిందటి నెల 30వ తేదీన ఈ అధ్యయనోత్సవాలు ఆరంభమైన విషయం తెలిసిందే.
సాధారణంగా ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి సరిగ్గా 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో ఈ అధ్యయనోత్సవం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాన్ని దివ్యప్రబంధ అధ్యయనంగా పిలుస్తారు. 9వ శతాబ్దంలో శ్రీవారి ప్రాశస్త్యాన్ని వివరిస్తూ 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలు ఇవి. వీటిపై శ్రీవైష్ణవ జీయంగార్లు గోష్ఠిగానం చేస్తారు.
24వ తేదీన తిరుమల నంబి చెంతకు శ్రీ మలయప్పస్వామి వేంచేపు చేస్తారు. 25న సర్వ ఏకాదశి, 26న అన్నమయ్య భవనంలో గణతంత్ర దినోత్సవం, 27న మాస శివరాత్రి, 29వ తేదీన శ్రీ పురంధర దాస ఆరాధన మహోత్సవాలు జరుగనున్నాయి.












Click it and Unblock the Notifications