చంద్రబాబుతో సత్య నాదెళ్ల భేటీ: ఐటి హబ్‌తో సహా పలు అంశాలపై ఒప్పందం(ఫొటోలు)
హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి(సీఈవో) సత్య నాదెళ్ల సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు.
విద్య, వ్యవసాయం రంగాల్లో మెరుగైన అభివృద్ధి, సమాచార సేకరణ, విశ్లేషణ, ముందస్తు అంచనాల కోసం మైక్రోసాఫ్ట్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సుమారు గంటకుపైగా జరిపిన సమావేశంలో పలు అంశాలపైనా ఇరువురు చర్చించారు. విశాఖలో సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు సత్య నాదెళ్ల అంగీకరించారు.
ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ హబ్‌గా మార్చడంతో పాటు... రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ కార్యాలయం ఏర్పాటుపై చంద్రబాబు.. సత్య నాదెళ్లతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్య కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్న ఏపి ప్రభుత్వాన్ని నాదెళ్ల అభినందించినట్లు ఐటి మంత్రి పల్లె రఘునాథ రెడ్డి వెల్లించారు. వచ్చే ఏడాది అనంతపురం జిల్లాలో పర్యటిస్తానని సత్య నాదెళ్ల తెలిపినట్లు ఆయన తెలిపారు.

ఇది ఇలా ఉండగా, నాదెళ్ల పర్యటనకు ముందే మైక్రోసాఫ్ట్ ఇండియా ఏపికి పిఓసి (ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్) ప్రకారం సాంకేతికంగా సహకరించనున్నట్టు తెలిపింది. ఏపికి క్లౌడ్ టెక్నాలజీ సహకారం అందించేందుకు మైక్రోసాఫ్ట్ సంసిద్ధత వ్యక్తం చేసింది. వ్యవసాయం, విద్య, పౌరసేవా రంగాల్లో మరింత సమర్ధంగా పనిచేయడానికి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు, ఎగ్జిక్యూటివ్‌లకు క్లౌడ్ టెక్నాలజీ, మరికొన్ని అంశాల్లో మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొంది.

వ్యవసాయంలో ఏయే ప్రాంతాల్లో ఏయే పంటలు వేయవచ్చనే అంశాన్ని ముందుగా తెలుసుకుని మెరుగైన ఉత్పాదకత సాధించేందుకు మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ తోడ్పడుతుందని ప్రభుత్వం అభిప్రాయపడింది. అలాగే మైక్రోసాఫ్ట్ అందించే ‘అజూర్ మెషిన్ లెర్నింగ్ టూల్స్ అండ్ పవర్ బీఐ' ద్వారా పాఠశాలల్లో డ్రాపవుట్లకు తగిన పరిష్కారాలతో చెక్ పెట్టవచ్చునని తెలిపింది.












Click it and Unblock the Notifications