Margadarsi : మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు-తెలంగాణ హైకోర్టులోకి బంతి..
ఏపీలో తీవ్ర సంచలనం రేపుతున్న మార్గదర్శి చిట్స్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ కేసుల బదిలీపై తుది విచారణను ముగిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ వ్యవహారాన్ని తెలంగాణ హైకోర్టే విచారిస్తుందని స్పష్టం చేసింది.
మార్గదర్శి చిట్స్ పై నమోదైన కేసుల్ని తెలంగాణ హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు ఇవాళ తేల్చిచెప్పింది. విచారణపై ఇప్పటికే తాము నిర్ణయం తీసుకున్నందున మరోసారి దీనిపై విచారణ అవసరం లేదని తెలిపింది. మరోవైపు మార్గదర్శి చిట్స్ ఛైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్ పై కఠిన చర్యలు తీసుకోవద్దన్న తెలంగాణ హైకోర్టు ఆదేశాల్లోనూ జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

మార్గదర్శి చిట్స్ అక్రమాలకు పాల్పడిందంటూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లపై ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. అయితే ఈ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ఇస్తున్న ఆదేశాల నేపథ్యంలో ఈ పిటిషన్లను ఏపీకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం కోరింది. అయితే జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం దీనిపై మరోసారి విచారణ చేసేందుకు అంగీకరించలేదు. తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దానిపై ఆభ్యంతరాలు ఉంటే తమను మరోసారి ఆశ్రయించవచ్చని తెలిపింది.
ఇప్పటికే ఏపీలో మార్గదర్శి సంస్ధలపై సీఐడీ దాడులు కొనసాగిస్తోంది. సంస్ధకు చెందిన పలువురు మేనేజర్లను అరెస్టులు కూడా చేసింది. ఛైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజాకిరణ్ లను హైదరాబాద్ వెళ్లి విచారించింది. అలాగే మార్గదర్శి కస్టమర్లకు కూడా నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి చిట్స్ అక్రమాలపై పత్రికల్లోనూ భారీ ప్రకటనలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో మార్గదర్శి కేసులపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లకు ప్రాధాన్యత ఏర్పడింది.












Click it and Unblock the Notifications