చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై రేపే సుప్రీం తీర్పు? అన్ని కేసులకూ కీలకం!
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై ఎఫ్ఐఆర్ నమోదు, అరెస్టు, రిమాండ్ ను క్వాష్ చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్ పై సుప్రీంకోర్టు రేపు (బుధవారం) తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో వాదనలు పూర్తి కావడంతో గత నెలలోనే తీర్పును రిజర్వు చేసిన సుప్రీంకోర్టు ఇప్పుడు దాన్ని వెలువరించేందుకు సిద్ధమైంది. చంద్రబాబుపై నమోదైన అన్ని కేసులకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొన్న వేళ ఈ తీర్పు చాలా కీలకంగా మారబోతోంది.
చంద్రబాబుపై ఈ ఏడాది సెప్టెంబర్ 10న స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఏపీ సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాకుండా అర్ధరాత్రి ఆయన్ను నంద్యాలలో అరెస్టు చేసింది. అక్కడి నుంచి విజయవాడకు తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో హాజరుపర్చింది. అనంతరం ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. అక్కడ 52 రోజుల రిమాండ్ తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో విడుదల అయ్యారు. ఈ కేసులో రేపు సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ ను ఆమోదిస్తే ఈ కేసుతో పాటు మిగతా కేసుల్లోనూ చంద్రబాబుకు ఊరట లభించడం ఖాయం.

చంద్రబాబుపై వైసీపీ సర్కార్ స్కిల్ డెవలప్మెంట్ కేసుతో పాటు ఏపీ ఫైబర్ నెట్ స్కాం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, మద్యం అక్రమాలు, ఇసుక అక్రమాల వంటి పలు కేసుల్ని నమోదు చేసింది. ఈ కేసులన్నింటికీ సెక్షన్ 17ఏతో సంబంధం ఉంది. సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబుపై సీఐడీ విచారణ చేయకూడదని టీడీపీ వాదిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం అవసరం లేదని చెబుతోంది. రేపు సుప్రీంకోర్టు దీనిపై ఇచ్చే తీర్పుపై ఈ వ్యవహారంపై క్లారిటీ రానుంది.
మరోవైపు ఏపీ ఫైబర్ నెట్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసు కూడా సెక్షన్ 17ఏతో ముడిపడి ఉన్న నేపథ్యంలో స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్ తీర్పు తర్వాత విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఇప్పుడు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ విచారణను ఎల్లుండి అంటే 9వ తేదీ చేపట్టబోతోంది. అంటే దాని కంటే ముందే క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications