చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందా లేదా ? సుప్రీంలో వాడీవేడీ వాదనలు-సోమవారానికి వాయిదా
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనను సెక్షన్ 17ఏ వర్తిస్తున్నా గవర్నర్ అనుమతి లేకుండా అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ వాడీవేడిగా వాదనలు సాగాయి. చంద్రబాబు తరఫున ముగ్గురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్ధ్ లూథ్రా, అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
ఇవాళ విచారణ మొత్తం చంద్రబాబును అరెస్టు చేసిన కేసులో సెక్షన్ 17ఏ వర్తిస్తుందా లేదా అన్న దానిపైనే వాదనలు సాగాయి. ముఖ్యంగా సెక్షన్ 17ఏపై గతంలో యశ్వంత్ సిన్హా కేసుతో పాటు పలు కేసుల్లో హైకోర్టులు ఇచ్చిన తీర్పుల్ని ఆయన లాయర్లు ఉదహరించారు. అలాగే 2018 జూలై 18 తర్వాత నమోదైన కేసుల్లో సెక్షన్ 17ఏ వర్తిస్తుందని, కాబట్టి ఈ సెక్షన్ ప్రకారం ప్రజాప్రతినిధులపై కేసులు పెట్టి అరెస్టు చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందేనని వాదించారు.

అయితే సుప్రీంకోర్టు ధర్మాసనంలో జడ్డీలు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ సెక్షన్ 17ఏ అవినీతి నిరోధక చట్టానికి వర్తిస్తుందని, ఐపీసీ సెక్షన్లకు కూడా వర్తిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉందన్నారు. చంద్రబాబుపై నమోదైన కేసులో అవినీతి నిరోధక చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్లు కూడా ఉన్నాయన్నారు. దీనిపై స్పందించిన చంద్రబాబు లాయర్లు సెక్షన్ 17ఏ కేవలం అవినీతి నిరోధక చట్టానికి మాత్రమే పరిమితం కాదని, దాని పరిధి విస్తృతంగా ఉందన్నారు. ప్రత్యర్ధులపై రాజకీయ వేధింపుల్ని అడ్డుకునేందుకే సెక్షన్ 17ఏ అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు.
దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గీ చంద్రబాబు కేసులో సెక్షన్ 17 వర్తించదన్నారు. నేరం ఎప్పుడు జరిగిందనేది ముఖ్యమని సెక్షన్ 17ఏ వచ్చాక నేరం జరగలేదన్నారు. దీంతో సుప్రీంకోర్టు దీనిపై ఇరువైపులా లాయర్లకు పలు ప్రశ్నలు సంధించింది. అలాగే చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో సమర్పించిన డాక్యుమెంట్లన్నీ తమకు అందించాలని సీఐడీకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు మెరిట్ కంటే సెక్షన్ 17ఏకే వాదనలు పరిమితం చేస్తామని కూడా ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications