జగన్ కోడి కత్తి కేసులో మరో కీలక పరిణామం ! ఎన్ఐఏకు సుప్రీంకోర్టు షాక్..!
ఏపీలో 2019 ఎన్నికల సమయంలో విపక్ష నేతగా ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి దాడి కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు సంస్ధ ఎన్ఐఏ దాఖలు చేసిన ఓ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు దాన్ని కొట్టేస్తూ కీలక తీర్పు వెలువరించింది. ఇదే కేసులో గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జోక్యానికి అత్యున్నత న్యాయస్ధానం నిరాకరించింది.
వైఎస్ జగన్ పై కోడి కత్తి దాడి కేసులో ఏకైక నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాసరావుకు గతంలో ఐదేళ్ల తర్వాత హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై హైకోర్టులో ఎన్ఐఏ అభ్యంతరం వ్యక్తం చేసినా తీర్పు మాత్రం నిందితుడికి అనుకూలంగానే వచ్చింది. దీంతో ఎన్ఐఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ కీలక తీర్పు వెలువరించింది.

కోడికత్తి దాడి కేసులో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. ఈ మేరకు ఎన్ఐఏ పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ రద్దు కోసం సుప్రీంకోర్టు వరకూ వెళ్లిన ఎన్ఐఏకు ఎదురుదెబ్బ తప్పలేదు. మరోవైపు ఇదే కేసులో ఎలాంటి కుట్రా లేదని ఏపీ హైకోర్టులో ఎన్ఐఏ గతంలో అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే దాడి చేసిన కారణంగా మాత్రమే నిందితుడి బెయిల్ ను ఎన్ఐఏ వ్యతిరేకిస్తోంది. ఈ కేసులో సమగ్ర విచారణ కోరుతూ వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్ కూడా హైకోర్టు విచారణలో ఉంది.












Click it and Unblock the Notifications