ఏపీలో నాలుగు కీలక పిటిషన్లపై నేడు సుప్రీం నిర్ణయం ? వివేకా, మార్గదర్శి కేసుల్లో..
ఏపీలో గత ఏడాది కాలంగా రెండు ముఖ్యమైన అంశాలపై వివిధ కోర్టుల్లో వరుస పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో మార్గదర్శి చిట్స్ అక్రమాల కేసుతో పాటు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దాఖలైన పిటిషన్లు ఉన్నాయి. వీటిపై కింది స్దాయి కోర్టులు తమ నిర్ణయాలు వెలువరించగా.. ఇవాళ సుప్రీంకోర్టు వాటిపై తమ నిర్ణయం చెప్పబోతోంది. ఈ రెండు కేసుల్లో మొత్తం నాలుగు కీలక పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరపబోతోంది.
సుప్రీంకోర్టులో ఇవాళ ఏపీకి సంబంధించి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు, మార్గదర్శి చిట్స్ అక్రమాల కేసుకు సంబంధించిన నాలుగు పిటిషన్లు వేర్వేరు బెంచ్ ల్లో విచారణకు రానున్నాయి. ఇలా ఒకే రోజు నాలుగు ఏపీ పిటిషన్లు, అలాగే రెండు కీలక కేసులకు సంబంధించినవి సుప్రీంకోర్టులో విచారణకు రావడం ఇదే తొలిసారిగా భావిస్తున్నారు. అలాగే వీటిపై సుప్రీంకోర్టు ధర్మాసనాలు వెలువరించే తీర్పులు కూడా రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారబోతున్నాయి.

వీటిలో మొదటిది మార్గదర్శి చిట్స్ అక్రమాల కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్. దీనిపై సుదీర్ఘ విరామం తర్వాత సుప్రీంకోర్టులోని కోర్టు నంబర్ 5లో ఐటెమ్ నంబర్ 12గా విచారణ జరగబోతోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ తమ అఫిడవిట్లు కూడా దాఖలు చేసిన ఈ పిటషన్ విచారణలో సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోందన్నది చాలా కీలకంగా మారింది. అలాగే కోర్టు నంబర్ 6లో మార్గదర్శి కేసుల విచారణను తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ చేయాలని కోరుతూ వైఎస్ జగన్ సర్కార్ దాఖలు చేసిన మరో పిటిషన్ ఐటమ్ నంబర్ 1గా విచారణకు రానుంది.
మరోవైపు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ8 నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన సోదరి సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు నంబర్ 3లో ఐటమ్ నంబర్ 20గా విచారణకు రానుంది. అలాగే వివేకా కేసులో నిందితులుగా ఉన్న ఎర్రగంగిరెడ్డితో పాటు ఇతర నిందితులపై సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కోర్టు నంబర్ 3లో ఐటెం నంబర్ 51గా విచారణకు రాబోతోంది.












Click it and Unblock the Notifications