చింతమనేని సీటు ఛేంజ్ - టీడీపీ, బీజేపీ సీట్లలో తాజా మార్పులు...!!
ఏపీలో ఎన్నికల పోరు కీలక దశకు చేరుకుంది. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. కూటమి సీట్లు - అభ్యర్దుల మార్పు పైన తుది కసరత్తు జరుగుతోంది. పొత్తులో భాగంగా టీడీపీ - బీజేపీ మధ్య గోదావరి జిల్లాల్లో మరిన్ని మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. అనరపర్తి సీటు బీజేపీకి ఇవ్వటం పైన పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. తాజాగా మూడు పార్టీల నేతల చర్చల్లో భాగంగా కొన్ని సీట్ల మార్పు పైన ఒక నిర్ణయానికి వచ్చారు.
సీట్ల మార్పు
పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ, 10 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించారు. అందులో నర్సాపురం ఎంపీ, అనపర్తి ఎమ్మెల్యే స్థానాల పైన కొంత కాలంగా చర్చ సాగుతోంది. నర్సాపురం ఎంపీ సీటు పైన రఘురామ రాజు ఆశలు పెట్టుకున్నారు. అయితే, బీజేపీ ఆ సీటు నుంచి శ్రీనివాస వర్మను ఖరారు చేసింది. దీంతో..రఘురామ టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆయన పేరు ఉండి స్దానం నుంచి పరిశీలనలో ఉంది. అటు బీజేపీకి అనపర్తి సీటు దక్కింది. అక్కడ టీడీపీ నుంచి నల్లమిల్లి రామక్రిష్ణారెడ్డి పేరు ఖరారైంది. కానీ, బీజేపీకి ఆ సీటు కేటాయించటం పైన నల్లమిల్లి వర్గం నిరసనకు దిగింది. అనేక చర్చల తరువాత అనపర్తి సీటు తిరిగి టీడీపీకి ఇవ్వటం పైన తాజాగా కీలక ప్రతిపాదన తెర మీదకు వచ్చింది.

రెండు పార్టీల మంతనాలు
అనపర్తి సీటు బీజేపీ వదులుకొని టీడీపీకి కేటాయిస్తే ఆ పార్టీకి తంబళ్లపల్లె ఇచ్చేలా తొలుత చర్చ జరిగింది. అయితే, తాజాగా బీజేపీ నేత గారపాటి ఆంజనేయులు తమ పార్టీ నాయకత్వంతో మంత్రాంగం నడిపారు. ఏలూరు ఎంపీగా పోటీ చేయాలని తొలుత ఆయన భావించారు. నర్సాపురం ఎంపీ సీటు మార్పు పైన చర్చ సమయంలో తమకు నర్సాపురం ఇస్తే ఏలూరు బీజేపీకి ఇస్తామని టీడీపీ నేతలు ప్రతిపాదించారు. కానీ, ఏలూరు ఎంపీ నుంచి టీడీపీ బీసీ అభ్యర్దిని ప్రకటించింది. ఇప్పుడు మార్పు చేయటం ద్వారా సమస్య వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అయింది. దీంతో, తాజాగా అనపర్తి సీటు టీడీపీకి ఇస్తే పశ్చిమ గోడావరి జిల్లా దెందులూరు సీటు బీజేపీకి ఇచ్చేలా నిర్ణయం ప్రకటించనున్నట్లు సమాచారం.
రెండు సీట్లలో మార్పులు
దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ టీడీపీ అభ్యర్దిగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీకి ఆ సీటు కేటాయిస్తే అక్కడ నుంచి గారపాటి ఆంజనేయులు అభ్యర్దిగా పోటీ చేస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించి రెండు పార్టీల ముఖ్య నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ సీట్ల సర్దుబాటు పైన నిర్ణయం జరిగిన తరువాత...రఘురామ పోటీ చేసే స్థానం పైన చంద్రబాబు తుది నిర్ణయం తీసుకొనే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో, ఇప్పుడు పశ్చిమ గోదావరి రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications