ఎస్‌ఈసీ ఈవాచ్ యాప్‌పై మొదలైన రగడ .. ఆవిష్కరించిన నిమ్మగడ్డ .. కోర్టు మెట్లెక్కిన వైసీపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం గా కొనసాగుతోంది. ఒకరు తీసుకున్న నిర్ణయాలను ఇంకొకరు వ్యతిరేకించడం, ఫిర్యాదులు చేయడం, కోర్టు మెట్లు ఎక్కడం క్రమంగా పంచాయతీ ఎన్నికల వాతావరణాన్ని హీటెక్కిస్తోంది .
తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నేపధ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు, అభ్యంతరాలు, పార్టీల ప్రలోభాలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం కోసం ఈ-వాచ్ కొత్త మొబైల్ యాప్ ను రూపొందించి, ఆ ప్రత్యేక యాప్ ను ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆవిష్కరించారు.

ఈ వాచ్ యాప్ పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్.. రేపు విచారణ
పంచాయతీ ఎన్నికలు సజావుగా జరగడం కోసం, ఎన్నికలపై ఎప్పటికప్పుడు అధికారులు ప్రజలకు సమగ్ర సమాచారం అందించడం కోసం, ఎన్నికల్లో తలెత్తే ఇబ్బందులను పరిష్కరించడం కోసం ఈ యాప్ రూపొందించామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెబుతోంది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ యాప్ పై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. అంతేకాదు ఏకంగా ఈ వాచ్ యాప్ పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేసింది . దీనిపై రేపు విచారణ జరుపుతామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

ఎస్‌ఈసి రాజ్యాంగ సంస్థ , ప్రైవేటు సంస్థలు అభివృద్ధి చేసిన యాప్ పై ఏపీ సర్కార్ అభ్యంతరం
న్యాయవాది జయరామి రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పిటిషన్ ను దాఖలు చేశారు . ఎస్‌ఈసి రాజ్యాంగ సంస్థగా ఉన్నప్పుడు ప్రైవేటు సంస్థలు అభివృద్ధి చేసిన యాప్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రారంభించినట్లు పిటిషన్‌లో ఆయన ఆరోపించారు. అయితే, లంచ్ మోషన్ పిటిషన్ను అంగీకరించడానికి హైకోర్టు నిరాకరించింది. దానికి బదులుగా పిటిషన్ ను గురువారం విచారించనుంది రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం

సెక్యూరిటీ సమస్యలు, హ్యాక్ అయ్యే అవకాశం ఉందన్న ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ లో భద్రతాపరమైన అనుమతులు ఏవి లేకుండా యాప్ ను తయారు చేశారని, ప్రభుత్వ వ్యవస్థలో యాప్ లు , సాఫ్ట్ వేర్ లు ఉపయోగించాలంటే అనుమతి తప్పనిసరిగా ఉండాలని, ఈ యాప్ వల్ల సెక్యూరిటీ సమస్యలు, హ్యాక్ అయ్యే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన యాప్ ఉండగా, ఈ వాచ్ యాప్ ఎందుకని ప్రశ్నించింది. కొన్ని పార్టీలకు లబ్ధి చేకూర్చేలా యాప్ ఉందని ఏపీ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది.

నిమ్మగడ్డ రహస్య యాప్ టీడీపీ కనుసన్నల్లో అంటూ వైసీపీ ధ్వజం .. పలు అనుమానాలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రహస్యంగా తయారుచేయించిన ఈ యాప్ టిడిపి కనుసన్నల్లోనే తయారయిందని వైసిపి ఆరోపిస్తోంది. ఇప్పటికే వైసీపీ నేతలు ఈ వాచ్ యాప్ విషయంలో నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ యాప్ ద్వారా తమ పిర్యాదులు ఫిల్టర్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా వారు అనుమానిస్తున్నారు. యాప్ విషయంలో వైసీపీ నేతలు మొదటి నుండి టీడీపీ యాప్ గా ఆరోపిస్తూ మూకుమ్మడి దాడికి దిగారు.

ఈ వాచ్ యాప్ విషయంలో మొదలైన రగడ
పంచాయతీ రాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కూడా యాప్ వెనుక టీడీపీ కుట్ర ఉందని ఆరోపించారు. కేవలం టిడిపి కోసమే టిడిపి కనుసన్నల్లోనే నిమ్మగడ్డ సొంత యాప్ తయారు చేశారని బాహాటంగానే విమర్శిస్తున్నారు. అయినాసరే నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు యాప్ ను ఆవిష్కరించారు. దీంతో వైసీపీ ప్రభుత్వం కోర్టు మెట్లు ఎక్కింది. ఇప్పుడు ఈ వాచ్ యాప్ విషయంలో మరెంత రగడ కొనసాగుతుందో అన్న భావన వ్యక్తమవుతోంది.