ఎమ్మెల్యే కావాలని ఉందా?, ఇలా చేయండి: జగన్ చెప్పిన సీక్రెట్స్
అమరావతి: ఎమ్మెల్యే కావాలంటే ఘనమైన వారసత్వం కావాల్సిన అవసరం లేదని, డబ్బులు ఉండాల్సిన అవసరం లేదని వైఎస్సార్సీపీ అధినేత జగన్ అన్నారు. విజయవాడలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకులు అయ్యేందుకు ఒక చక్కని అవకాశాన్ని తాను కల్పిస్తున్నానని చెప్పారు.
నియోజక వర్గం పరిధిలోని ప్రతి పంచాయితీలో ప్రతి ఇంటికీ రోజుకి నాలుగు గంటల చొప్పున, 5 నెలల పాటు రోజుకొక పంచాయతీ చొప్పున ప్రచారం చేస్తే విజయం మీ సొంతమవుతుందని ఆయన తెలిపారు. 5 నెలలు పూర్తయ్యే సరికి మీరే లీడర్లు అవుతారని ఆయన చెప్పారు. నాయకులను తయారు చేసే క్రమంలో భాగంగా 'గడప గడపకూ వైయస్ఆర్' అనే ఈ కార్యక్రమానికి శ్రీకారం పలుకుతున్నానన్నారు.
ఈ కార్యక్రమాన్ని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి అయిన జూలై 8వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాజకీయాల్లోకి రావాలని, తాను కూడా ఓ ఎమ్మెల్యేలను కావాలని చాలా మంది అనుకుంటారని చెప్పిన జగన్ అలాంటి ఉత్సాహవంతులైన యువకులకు తాను సపోర్ట్ చేస్తానన్నారు. రాజకీయాల్లో గెలవడానికి ఒక సీక్రెట్ చెప్పారు.

రాజకీయాల్లో గెలవాలంటే 'గడపగడపకూ వైయస్ఆర్' కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఈ కరపత్రాన్ని ప్రతి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశావహులకు, సమన్వయకర్తలకు ఇస్తామని చెప్పారు. ఎన్నికలకు మందు చంద్రబాబు ఏం చెప్పారో.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన మాటలు, ఆయన ఏం చెప్పాడో ఇందులో కోట్ చేశామన్నారు.
రాజకీయ వ్యవస్థ మార్పులకు నాంది పలకాలనే నా మాటలు కూడా ఇందులో ఉన్నాయన్నారు. ఈ కరపత్రంలో వంద ప్రశ్నలు ఇచ్చి చంద్రబాబుకు మార్కులు వేయాలని కోరుతున్నామన్నారు. ఎమ్మెల్యేగా కావాలనుకుంటున్న వ్యక్తి మీ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లండి.
ఈ కరపత్రాన్ని ప్రజలు పంచి, ప్రజలచేత చంద్రబాబుకు మార్కులు వేయించాలని జగన్ సూచించారు. వాళ్లు మార్కులు వేయడం మొదలుపెడితే వందకు ఆయనకు వచ్చే మార్కులు సున్నా అని తెలిస్తే ప్రజలే ఆయనను బంగాళాఖాతంలో కలుపుతారన్నారు.
సమయం ఉంది కాబట్టి ప్రతి ఇంట్లో కనీసం రెండు మూడు నిమిషాలు గడపాలని జగన్ ఎమ్మెల్యేలకు సూచించారు. వాళ్ల ఆశీస్సులు తీసుకోండి.. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోండని కోరారు. ప్రతి కోఆర్డినేటర్ ప్రతి ఇంటికీ వెళ్లినప్పుడు గ్రామంలో ప్రతి ఇల్లూ తిరిగితే గ్రామం మీద అవగాహన వస్తుందన్నారు.
ఎవరు మన పార్టీతో పాటు నడుస్తున్నారు, ఎవరు ఉత్సాహంగా మనతో ఉన్నారనే విషయంలో ఒక క్లారిటీ వస్తుందన్నారు. ఇలా గ్రామం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసరికి ఒక బూత్ కమిటీ నియమించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అంతేకాదు మీతో పాటు ఆ గ్రామంలో ఉత్సాహంగా నడిచిన వ్యక్తులను ఆ కమిటీలలో నియమించాలన్నారు.

ఇలా రోజుకు కేవలం ఒక పంచాయితీ మాత్రమే తిరగాలన్నారు. సాయంత్రం పూట ప్రజలంతా ఇళ్లలో ఉన్నప్పుడు మాత్రమే గ్రామానికి వెళ్లాలని సూచించారు. ఐదు నెలల్లో నియోజకవర్గంలోని ప్రతి ఇల్లు మీరు తిరిగినట్లు అవుతుంది. ఇక మీ వెనుక ఎవరూ ఉండాల్సిన పని లేదన్నారు.
ఈ ఐదు నెలల తర్వాత మీరు లీడర్ అవ్వకపోతే నన్ను అడగండని జగన్ చెప్పారు. ఏ పార్టీలో ఉన్న రాజకీయాల్లో ఇప్పటి వరకు ఓటమిని ఎరుగని సీనియర్ ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. తన నియోజక వర్గంలో ఆయన ఇప్పటికే రెండు సార్లు తిరిగేశారని చెప్పుకొచ్చారు.
ఇలా ప్రజలతో మమేకమైతే ఒకసారి గెలిచిన ఏ ఎమ్మెల్యే అయినా మళ్లీ ఓడిపోరని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని నిజంగా ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు చేశారన్నారు. తమకు మేలు చేస్తారని నమ్మకం ఉన్న నాయకులకే ప్రజలు ఓట్లు వేస్తారన్నారు. ఇలా చేయడం వల్ల ప్రతి గ్రామంలో బూత్ కమిటీలు ఏర్పాడతాయని జగన్ అన్నారు.
'గడప గడపకూ వైయస్ఆర్' కార్యక్రమంలో భాగంగా కరపత్రంలో కో-ఆర్డినేటర్ ఫొటో పెట్టుకునేదానికి కూడా స్థలం ఉందన్నారు. ఇలా నియోజకవర్గ సమస్యలపై మీరు ఏమైనా కరపత్రంలో వేస్తే అది కూడా వేసి తీసుకెళ్లండని సూచించారు. జూలై 8న వైఎస్ఆర్ జయంతి.. ఆరోజునే గడప గడపకూ వైఎస్ఆర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.
అయితే గ్రామంలో తిరగామంటే తిరిగాం అన్న రీతిగా ఉండకూడదన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు. గ్రామంలో ఉన్న ప్రజలందరినీ ఒకచోటుకు రప్పించి మాట్లాడి వెళ్తే నష్టం జరగుతుందని చెప్పారు. ఇలా కాకుండా వారి ఇంటికి వెళితే వారి ఆశీస్సులు లభిస్తాయన్నారు.
అంతేకాదు ఊరిలో, ఆ సందులో ఏ సమస్య ఉందన్న విషయం కూడా పూర్తి అవగాహనకు వస్తుందన్నారు. దీంతో పాటు చంద్రబాబు రెండేళ్ల పాలనపై పుస్తకాలు కూడా వేశామన్నారు. ఈ పుస్తకంలోని ప్రతి అంశం కార్యకర్తలందరికీ తెలియాలని అన్నారు. ఇంతకుముందు నాయకులు పలు అంశాలమీద మాట్లాడారు, తీర్మానాలు చేశారన్నారు.
అందులో బాధ కలిగించే అంశాలు రెండు మూడు ఉన్నాయన్నారు. రాష్ట్రాన్ని పణంగా పెట్టి ప్రత్యేక హోదాను చంద్రబాబు మంటగలిపారని ధ్వజమెత్తారు. కేంద్రమంత్రి వర్గంలో తన మంత్రులు ఉన్నా... వాళ్లను ఉపసంహించుకునే పరిస్థితి లేదన్నారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వారిని ఉపసంహరించుకుంటాననే అనే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేవని ఎద్దేవా చేశారు.
ఈ పుస్తకం.. ఇందులోని కొన్ని అంశాలన్నింటిపై సీబీఐ విచారణ వేసి మోడీ గారు జైల్లో పెడతారేమోనని భయం చంద్రబాబుకు పట్టుకుందన్నారు. కృష్ణ, గోదావరి నదుల మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డుగోలుగా ప్రాజెక్టులు కడుతున్నా అడిగే పరిస్థితిలో చంద్రబాబు లేరన్నారు.
అందుకు కారణం కూడా ఈ పుస్తకంలో వివరించామన్నారు. రాష్ట్రం కోసం వైసీపీ చేస్తున్న పోరాటం, చంద్రబాబు చేతకానితనం, ఆయన చేస్తున్న అవినీతి , మోసాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని జగన్ కోరారు.












Click it and Unblock the Notifications