ట్విస్ట్, అమల్లోనే సెక్షన్ 8!: కేంద్రంకాదు గవర్నర్ నిర్ణయమే
దరాబాద్: సీమాంధ్రుల రక్షణార్థం హైదరాబాదులో సెక్షన్ 8 కావాలని ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తుండగా, తెలంగాణ ప్రాంత నేతలు ససేమీరా అంటున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకుల నుండి సాధారణ వ్యక్తి వరకు సెక్షన్ 8 పైన చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
సెక్షన్ 8 పైన తికమక కనిపిస్తోంది. సెక్షన్ 8 అమలు చేయాలని ఏపీ టీడీపీ, అవసరం లేదని టీఆర్ఎస్, తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ బీజేపీ, ఇప్పుడు అమల్లోనే ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. సెక్షన్ 8 ఉండాలని, కానీ ఓటుకు నోటు వ్యవహారం వచ్చినప్పుడే గుర్తుకు వచ్చిందా అని ఏపీ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.
ఈ సమయంలో హైకోర్టులో సెక్షన్ 8 పైన వేసిన పిటిషన్ నేపథ్యంలో న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సెక్షఖన్ 8, ఓటుకు నోటు కేసులో సీబీఐ విచారణ జరపాలని న్యాయవాది కృష్ణయ్య పిటిషన్ వేశారు. దీనిని హైకోర్టు సోమవారం కొట్టివేసింది.

ఈ సందర్భంగా.. ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సెక్షన్ 8 అమలులో కేంద్రం పాత్ర ఏమిటని ప్రశ్నించింది. కేంద్రం ఆదేశిస్తేనే సెక్షన్ 8 అమలు చేయాలని చట్టంలో లేదని చెప్పింది. విభజన చట్టం ప్రకారం సెక్షన్ 5లో ఉన్న ఉమ్మడి రాజధాని అమలు అవుతున్నప్పుడు సెక్షన్ 8 కూడా అమలులో ఉన్నట్లేనని చెప్పింది. సెక్షన్ అమలు బాధ్యత గవర్నర్‌దేనని చెప్పింది.
ఇన్నాళ్లు సెక్షన్ 8 పైన రాజకీయ పార్టీలు తలోరకంగా మాట్లాడుతున్నారని చెప్పవచ్చు. హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేయాలని ఏపీ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తాము సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతామని హెచ్చరించారు.
సెక్షన్ 8 అమలు చేస్తే ఊరుకునేది లేదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అమలు చేస్తే మరో ఉద్యమం తప్పదంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే ఢిల్లీలో నిరాహార దీక్షకు సిద్ధమని హెచ్చరించారు. టీడీపీ ఒత్తిడికి తలొగ్గి సెక్షన్ 8 అంటే ఊరుకునేది లేదని కేంద్రానికి హెచ్చరికలు పంపారు.
అయితే, సోమవారం నాడు హైకోర్టు వ్యాఖ్యలతో ఇది కొత్త మెలిక తిరిగిందని చెప్పవచ్చు. కేంద్రానికి సంబంధమేమిటని, విభజన చట్టం ప్రకారం సెక్షన్ 5 అమలులో ఉన్నప్పుడు సెక్షన్ 8 అమలు అవుతున్నట్లేనని వ్యాఖ్యానించింది. తద్వారా బంతి గవర్నర్ కోర్టులోనే ఉందని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications