సంకల్ప దీక్ష విరమణ: లగడపాటికి టీ సెగ, ఉద్రిక్తం
హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు చేపట్టిన రెండు రోజుల సంకల్ప దీక్షను శనివారం విరమించారు. రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ దీక్షను విరమింపజేశారు. ఈ సమయంలో కాస్తా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణవాదులు కొంత మంది జై తెలంగాణ నినాదాలు చేస్తూ లగడపాటి రాజగోపాల్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. సమైక్యవాదులు వారిని ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
లగడపాటి రాజగోపాల్ మీడియాతో మాట్లాడి ర్యాలీగా వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు ఆయన ర్యాలీని అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని వారు వారించారు. ట్యాంక్‌బండ్‌పై గల తెలుగుతల్లి విగ్రహం వరకు ఎంపీలు ర్యాలీ తీయడానికి ప్రయత్నించారు. తెలంగాణవాదులను అదుపులోకి తీసుకుని పోలీసులు అక్కడి నుంచి పంపించివేశారు.

తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో చర్చ జరగాలని లగడపాటి రాజగోపాల్ మీడియా ప్రతినిధులతో అన్నారు. చర్చ జరిగితేనే ఎవరు లాభపడ్డారో, ఎవరు నష్టపోయారో తెలుస్తుందని ఆయన అన్నారు. చర్చను వాడుకుని రాష్ట్ర సమైక్యతను కాపాడాలని ఆయన శాసనసభ్యులకు సూచించారు. శాసనసభ్యులు సమైక్యవాదాన్ని వినిపించాలని ఆయన కోరారు.
పార్లమెంటు సమావేశాల్లో తాము తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తామని మరో పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి అన్నారు. లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, హర్షకుమార్ శుక్రవారంనాడు హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద సంకల్ప దీక్షను ప్రారంభించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications