టాలీవుడ్‌కు పీవీ సునీల్ కుమార్ చురకలు- ఎప్పటికీ అంటరానివే..!!
అమరావతి: ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైన తమిళ సినిమా.. మామన్నన్. మారి సెల్వరాజ్ దర్శకుడు. సీనియర్ కమేడియన్ వడివేలు.. తొలిసారిగా సీరియస్ క్యారెక్టర్‌లో కనిపించారు. కాశీపురం శాసన సభ్యుడిగా, తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా అదరగొట్టారు. దళితుల అంశాలను ప్రధానంగా ప్రస్తావించారీ మూవీలో. నాయకుడు పేరుతో తెలుగులో డబ్ అయింది ఈ సినిమా.
ఈ సినిమా దళిత వర్గాల ప్రశంసలను అందుకుంటోంది. ఈ క్రమంలో సీనియర్ ఐపీఎస్ అధికారి, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ పీవీ సునీల్ కుమార్ ఈ సినిమాను ఆకాశానికెత్తేశారు. మామన్నన్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు. తెలుగు సినిమా పరిశ్రమతో ఈ సినిమా గొప్పదనాన్ని పోల్చారాయన.

ఈ సినిమాపై తన అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. 75 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో దళితుల ఆత్మ గౌరవ ప్రశ్నను ఎన్ని తెలుగు సినిమాలు చూపించాయి? అని ప్రశ్నించారు. జనాభాలో నూటికి 20 మంది దళితులు ఉంటే.. 100 కోట్ల రూపాయలను వసూలు చేసిన సినిమాకు వాళ్లిచ్చిన చందా 20 కోట్ల రూపాయలుగా లెక్క వేశారు.
100 కోట్ల రూపాయలపైన వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో ఏ దళితుల అంశాన్ని ప్రస్తావించారని, వారి సమస్యల గురించి ప్రశ్నించారని పీవీ సునీల్ కుమార్ పేర్కొన్నారు. అన్ని కోట్ల రూపాయలను ఎందుకు గుమ్మరించారని ప్రశ్నించారు. తమ తాతలు, వంశాల గొప్పలు, గ్లోరిఫికేషన్, రాజుల కథలు, హీరోయిన్ అందాలు, మరికొందరి అందాంద ప్రదర్శన తప్ప దళితులు చూడ్డానికి తెలుగు సినిమాలో ఇంకేమీ లేవా? అని నిలదీశారు.

మన జీవితాలు, మన సమస్యలు, చివరికి మన ఎమోషన్స్.. కూడా తెలుగు సినిమాకు ఎప్పటికీ అంటరానివేనని ఆవేదన వ్యక్తం చేశారు పీవీ సునీల్ కుమార్. అలాంటప్పుడు ఇంకా తెలుగు సినిమా జీరోలు, వాళ్ల ఫ్లెక్సీలను మన వాడల దాకా ఎందుకు రానిస్తారని అన్నారు. మామన్నన్, ఒన్నియన్ పెరుమాళ్ చూసి మనం చూసే సినిమాలు ఎలా ఉండాలో నిర్ణయించుకోవాలని దళితులకు సూచించారు.
సినిమాటిక్ కోణంలో చూసినా తెలుగు సినిమా హీరోలు జీరోలేనని, మామన్నన్‌లో హీరో పెంచే పందులు, ఫహాద్ ఫాజిల్ పెంచే కుక్కలు కూడా చాలా చక్కగా నటించాయని చురకలు అంటించారు. ఈ రెండు వాక్యాలను విడి విడిగా చదువుకోవాలంటూ పీవీ సునీల్ కుమార్ సూచించారు.












Click it and Unblock the Notifications