borugadda anil: బోరుగడ్డకు గుంటూరు కోర్టు బిగ్ షాక్..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలపై ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కు కూటమి ప్రభుత్వంలో మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ చర్చి కోశాధికారిని 50 లక్షల కోసం బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్టు అయిన బోరుగడ్డను మరిన్ని కేసులు వెంటాడుతున్నాయి. దీంతో తాజాగా ఆయన్ను పోలీసులు ట్రాన్సిట్ వారెంట్ పై శ్రీకాకుళం కూడా తీసుకెళ్లారు. అయితే ఇవాళ గుంటూరు కోర్టు బోరుగడ్డకు షాకిచ్చింది.
బాబూ ప్రకాష్ అనే చర్చి కోశాధికారిని 50 లక్షలు ఇవ్వాలని బెదిరించిన కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ బోరుగడ్డ అనిల్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను గుంటూరు కోర్టు తోసిపుచ్చింది. బోరుగడ్డ బెయిల్ పై గుంటూరు కోర్టులో వాడీవేడిగా వాదనలు సాగాయి. ఈ సందర్భంగా బాధితుడు బాబూ ప్రకాష్ ఎవరో తనకు తెలియదని బోరుగడ్డ తెలిపారు. కానీ పోలీసులు కోర్టుకు పక్కా ఆధారాలు సమర్పించడంతో బోరుగడ్డ బెయిల్ ను కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు ఆయన పిటిషన్ కొట్టేసింది.

బోరుగడ్డ అనిల్ కుమార్ పై గతంలో వైసీపీ హయాంలో విపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో వైసీపీ సర్కార్ ఆయనకు గన్ మెన్ల భద్రత కూడా కల్పించింది. దీనిపై తాజాగా పోలీసు కస్టడీలో జరిగిన విచారణలో ప్రశ్నించగా.. వైసీపీ పెద్దలతో ఉన్న సంబంధాలతోనే గన్ మెన్లను ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే వైసీపీ తో తనకు సంబంధాలు ఉన్నాయని బోరుగడ్డ చెప్పుకుంటుండగా... ఆ పార్టీ నేతలు మాత్రం బోరుగడ్డతో తమకెలాంటి సంబంధం లేదంటున్నారు.












Click it and Unblock the Notifications