ఉత్తరాంధ్ర టీచర్స్ పోరులో కూటమికి షాక్ ? పీఆర్టీయూ ముందంజ..!
ఏపీలో తాజాగా రెండు గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు మరో టీచర్స్ కోటా ఎమ్మెల్సీ ఎన్నిక కూడా జరిగింది. ఇందులో కృష్ణా-గుంటూరు, గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ స్ధానాలతో పాటు ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్ధానం కూడా ఉంది. ఈ మూడు సీట్లకు ఇవాళ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందులో తక్కువ ఓట్లు ఉన్న ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్ధానం ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇందులో కూటమికి తొలి రౌండ్ లో ఎదురుదెబ్బ తగిలింది.
ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్ధానంలో పీఆర్టీయూ అభ్యర్ధిగా గాదె శ్రీనివాసులు నాయుడు, కూటమి బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్ధిగా పాకలపాటి రఘువర్మ, పీడీఎఫ్ అభ్యర్ధిగా విజయగౌరి పోటీ చేశారు. ఈ ముగ్గురి మధ్య జరిగిన త్రిముఖ పోటీలో గాదె శ్రీనివాసులు నాయుడు ముందున్నారు. తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో ఎవరికీ గెలిచేంత ఆధిక్యం రానప్పటికీ శ్రీనివాసులు నాయుడు మాత్రం తన సమీప ప్రత్యర్థి, కూటమి అభ్యర్ధి అయిన రఘువర్మ కంటే 400 ఓట్లకు పైగా ఆధిక్యం అందుకున్నారు.

మొత్తం 20783 ఓట్లకు పోలింగ్ జరగగా.. ఇందులో 19813 ఓట్లు చెల్లేవిగా గుర్తించారు. ఇందులో తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో గాదె శ్రీనివాసులు నాయుడికి 7210 ఓట్లు రాగా.. కూటమి బలపరచిన ఏపీటీఎఫ్ అభ్యర్ధి రఘువర్మకు 6835 ఓట్లు వచ్చాయి. మూడో స్ధానంలో ఉన్న పీడీఎఫ్ అభ్యర్ధి విజయగౌరికి 5810 ఓట్లు వచ్చాయి. దీంతో ఫలితం రెండో రౌండ్ లోనే తేలనుంది. మొత్తం లెక్కిస్తున్న ఓట్లలో 2.3 శాతం చెల్లనివిగా తేలడం విశేషం.












Click it and Unblock the Notifications