ఏపీ సచివాలయ ఉద్యోగులకు మరో షాక్-ప్రొబేషన్ కు మరో కండిషన్-ఆ లెక్క తేలితేనే..
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు గతేడాది అక్టోబర్ నుంచి ఎదురుచూస్తున్న ప్రమోషన్ ఇచ్చేందుకు గడువు దగ్గరపడుతోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ ప్రొబేషన్ ఖరారు కోసం ఉద్యోగులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం వారికి మరో షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఓటీఎస్ పథకం కింద వసూలైన మొత్తాల లెక్క తేలితేనే వారికి ప్రొబేషన్ ఇస్తామని షరతు విధించింది. దీంతో ఇన్నాళ్లూ ప్రొబేషన్ కోసం ఎదురుచూస్తున్నవారికి అనూహ్యంగా షాక్ తగిలినట్లయింది.

సచివాలయ ఉద్యోగాల ప్రొబేషన్
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాల్ని ఇంటింటికీ చేరవేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 1.37 లక్షల ఉద్యోగుల్ని నియమించారు. వివిధ విభాగాల్లో కార్యదర్శుల పేరుతో వీరికి ఉద్యోగాలు ఇచ్చారు. అయితే రెండేళ్ల పాటు ప్రొబేషన్ కింద పనిచేయాలని, ఆ తర్వాత శాఖాపరమైన పరీక్షలు రాసి ఉత్తీర్ణులు అయితే ప్రొబేషన్ ఖరారు చేసి రెగ్యులర్ ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం అప్పట్లో షరచు పెట్టింది. ప్రొబేషన్ కాలంలో నెలకు 15 వేల చొప్పున ఇస్తామని, ఉద్యోగం ఖరారైన తర్వాత రెగ్యులర్ వేతనాలు ఉంటాయని హామీ ఇచ్చింది. దీని ప్రకారం వారు గతేడాది అక్టోబర్ 2వ తేదీకి వారి ప్రొబేషన్ కాలం పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత నిర్వహించిన శాఖాపరీక్షల్లోనూ దాదాపు 80 వేల మందికి పైగా ఉత్తీర్ణులయ్యారు. వీరందరికీ ఇంకా ప్రొబేషన్ ఇవ్వలేదు.

ప్రొబేషన్ జూన్ లో ఇస్తామని జగన్ హామీ
గతేడాది నుంచి పెండింగ్ లో ఉన్న సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ను ఈ ఏడాది జూన్ లో ఖరారు చేస్తామని సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ కూడా ఇంకా నెరవేరలేదు. తాజాగా ఈ డెడ్ లైన్ ను జూలైకి మార్చారు. జూలైలో ప్రొబేషన్ ఇస్తామని, ఈ లెక్కన ఆగస్టు నెలలో కొత్త వేతనాలు తీసుకోవచ్చని తెలిపారు. దీంతో వచ్చే నెలలో ఎలాగైనా తమకు ప్రొబేషన్ ఖరారవుతుందని క్వాలిఫైడ్ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే వారికి ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది.

ఓటీఎస్ వసూళ్ల లెక్క తేలాకే ప్రొబేషన్ ?
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ, గతంలో ఇచ్చిన క్రమబద్ధీకరణ కోసం ఓటీఎస్ పథకాన్ని తీసుకొచ్చింది. దీని కింద ఇప్పటికే లక్షల ఇళ్లను క్రమబద్ధీకరించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా రూ.82.46 కోట్లు వసూలు కావాల్సి ఉంది. అయితే పలు చోట్ల వివిధ కారణాలతో ఇంకా వసూళ్లు పూర్తి కాలేదని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం ఓటీఎస్ కింద వసూలైన రూ.82. 46 కోట్ల లెక్క తేల్చాలని సచివాలయాలకు ఆదేశాలు ఇచ్చింది. వీటి లెక్క తేలాకే ప్రొబేషన్ ఖరారు చేస్తామని సీఎస్ సమీర్ శర్మ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో కొన్నిరోజులుగా ప్రొబేషన్ వచ్చేస్తుందని ఆశలు పెట్టుకున్న సచివాలయ ఉద్యోగాలకు నిరాశ ఎదురవుతోంది.












Click it and Unblock the Notifications