సజ్జలకు సుప్రీంకోర్టు షాక్- అక్కడే తేల్చుకోమని సలహా..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఆయన కుమారుడికీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రోజుకో షాకిస్తోంది. ఇప్పటికే సజ్జల రామకృష్ణను టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో టార్గెట్ చేస్తున్న ప్రభుత్వం.. ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డిని సోషల్ మీడియా పోస్టుల విషయంలో టార్గెట్ చేస్తోంది. ఇదే క్రమంలో రాష్ట్రంలోని పలు చోట్ల భార్గవ్ రెడ్డిపై నమోదైన కేసుల్ని క్వాష్ చేయాలని ఆయన సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు.
రాష్ట్రంలో గత ప్రభుత్వంలో వైసీపీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదు చేస్తోంది. ఇందులో భాగంగా అరెస్టు అయిన నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా సజ్జల భార్గవ్ రెడ్డిపైనా కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో ఆయన సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై ఇవాళ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టేందుకు అంగీకరించలేదు. భార్గవ్ రెడ్డి తనపై ఏపీలో నమోదైన కేసులను క్వాష్ చేసే అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని తేల్చిచెప్పేసింది.

ఇవాళ సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్ రెడ్డి పిటిషన్ పై విచారణ సందర్భంగా ఆయన లాయర్ కపిల్ సిబల్ కూ, ఏపీ ప్రభుత్వ లాయర్ సిద్దార్ధ్ లూథ్రాకూ మధ్య గట్టిగా వాదోపవాదాలు జరిగాయి. గతంలో జరిగిన విషయాలకు కొత్త చట్టాల ప్రకారం ప్రభుత్వం కేసులు పెడుతోందని కపిల్ సిబల్ వాదించారు. దీనికి కౌంటర్ గా సిద్ధార్ధ్ లూథ్రా వాదిస్తూ.. చట్టాలు ఎప్పటివన్నది కాదని మహిళలపై పిటిషనర్ చేసిన అసభ్య వ్యాఖ్యల్ని చూడాలని కోర్టును కోరారు. అలాగే ఆయన దర్యాప్తుకు సహకరించడం లేదని కూడా తెలిపారు. దీంతో కోర్టు ఈ కేసుపై విచారణను కొనసాగించేందుకు విముఖత చూపింది. రెండు వారాల్లో హైకోర్టునే ఆశ్రయించేందుకు సమయం ఇచ్చింది.












Click it and Unblock the Notifications