Jogi Ramesh: జోగి రమేశ్ కు మరో షాక్- హైకోర్టు ఆదేశాల వేళ రూటుమార్చి..!
ఏపీలో తాజాగా మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలు ఎదుర్కొంటూ తనపై పోలీసులు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఊరట కల్పించాలని వైసీపీ నేత జోగి రమేశ్ (jogi ramesh) హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై నిన్న హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. లోకేష్ పై జోగి రమేశ్ చేసిన ఆరోపణలపై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ ఏడేళ్ల లోపు జైలుశిక్ష పడేవి, బెయిల్ ఇచ్చేవి మాత్రమేని ఆయన లాయర్లు వాదించారు. దీంతో ఆయనకు హైకోర్టు ఊరటనిచ్చింది.
లోకేష్ పై వ్యాఖ్యల విషయంలో జోగి రమేష్ పై కఠిన చర్యలు తీసుకోవద్దని, అరెస్టు చేయొద్దని, ఒకవేళ తప్పనిసరై అరెస్టు చేయాల్సి వచ్చినా రాతపూర్వకంగా ఆ విషయం ఆయనకు తెలియజేయాలని పోలీసుల్ని ఆదేశించింది. దీంతో పోలీసులకు ఎదురుదెబ్బ తప్పలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు మరో అంశంలో జోగి రమేష్ కు షాకిచ్చారు. తాజాగా జోగి రమేష్ ఇంటిపై టీడీపీ నేతలు దాడులు చేసిన నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వచ్చారు.

జగన్ రాక సందర్భంగా ఇబ్రహీంపట్నంలో పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. దీంతో పోలీసులకూ, జోగి రమేష్ కూ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో జోగి రమేష్ పోలీసుల విధులకు ఆటంకం కల్పించారంటూ స్ధానిక ఎస్సై రవివర్మతో
ఫిర్యాదు చేయించి నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. బైక్ ర్యాలీ చేపట్టడంతో పాటు జన సమీకరణ చేయడం, పబ్లిక్ న్యూసెన్స్ చేయడం, రోడ్డు బ్లాక్ చేయడం వంటి అభియోగాల్ని మోపారు. అలాగే సున్నితమైన ప్రాంతాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలో పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు.












Click it and Unblock the Notifications