సికింద్రాబాద్ - విశాఖ వందేభారత్ వేళల్లో మార్పు..!?
తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ కు ఆదరణ రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా ప్రారంభించిన సికింద్రాబాద్ - విశాఖ వందేభారత్ ప్రయాణ వేళల పైన కొత్త డిమాండ్ తెర మీదకు వచ్చింది. సికింద్రాబాద్ నుంచి ఈ రైలు ఉదయం 5.05 గంటలకే బయల్దేరుతోంది. దీంతో స్టేషన్ కు చేరుకోవటానికి ఆటోలు, క్యాబ్ లు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రయాణీకులు వాపోతున్నారు. ఈ రైలు ప్రారంభం వేళలు మార్చాలని తాజాగా రైల్వే అధికారులకు వినతులు అందుతున్నాయి.
రెండో వందేభారత్ రాకతో : ఈ నెల 12న సికింద్రాబాద్ - విశాఖ రెండో వందేభారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. వాస్తవానికి ఈ రైలు ఉదయం 6 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి బయల్దేరాల్సి ఉంది. కానీ, ఆ సమయంలో ఇతర రైళ్లు నడుస్తుండటంతో ఈ రైలు సమయం లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 7.10కి లింగంపల్లి - విశాఖ మధ్య నడిచే జన్మభూమి ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ లో బయల్దేరుతుంది. ఇది కూడా వందేభారత్ తరహాలో ఛైర్ కార్ ఎక్స్ ప్రెస్ రైలు. దీంతో, వందేభారత్ ప్రారంభ సమయం 5.05 గంటలుగా నిర్ణయించారు. కానీ, ఈ సమయం ప్రయాణీకులకు అసౌకర్యంగా మారుతోంది. స్టేషన్ కు నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి చేరుకోవటం సమస్యగా మారింది.

వేళల మార్పు పైన : విశాఖకు నడుస్తున్న రెండు వందేభారత్ రైళ్లు వరంగల్ మీదుగా నడుస్తున్నాయి. ఈ మార్గంలో మూడో లైన్ అందుబాటులో లేదు. ఉన్న రెండు లైన్ల మీదుగా వందల సంఖ్యలో రైళ్లు ప్రయాణిస్తున్నాయి. ప్రయాణీకుల రైళ్లు, సరుకు రవాణా రైళ్లు ఈ రెండు లైన్ల మీదుగా నడపాల్సి వస్తోంది. ఈ మార్గంలో మూడో లైన్ పనులు 2017 నుంచి నడుస్తున్న జాప్యం కొనసాగుతోంది. మూడో లైన్ పూర్తయితే మరిన్ని రైళ్లు నడిపేందుకు వీలవుతుంది. ప్రాయణీకులకు అనువైన విధంగా మార్పులు చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తొలి వందేభాతర్ వరంగల్ రూటులో నడుస్తున్నందున, రెండో వందేభారత్ నల్గొండ - నడికూడి గుంటూరు మార్గంలో నడపాలని భావించారు. కానీ, సింగ్ లైన్ కావటంతో నిర్ణయం మార్చుకున్నారు.

వంద శాతం ఆక్యుపెన్సీ : ఈ మార్గంలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ పెస్ వస్తే ఇతర రైళ్లను నిలపాల్సి వస్తోంది. దీంతో, వరంగల్ మీదుగానే రెండో వందేభారత్ ను కొనసాగిస్తున్నారు. విశాఖ కు నడిచే మొదటి వందేభారత్ రైలు సికింద్రాబాద్ లో మధ్నాహ్నం 3 గంటలకు బయల్దేరుతుంది. ఈ రైలుకు దాదాపు 114 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతుంది. కనీసం అయిదారు రోజుల వెయిటింగ్ లిస్టు ఉంటోంది. దీనికి ఆదరణ బాగుండటంతో రెండో వందేభారత్ రైలు ప్రారంభించారు. ఈ రైలు వందశాతం ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తోంది. నాలుగు రోజులు వెయిటింగ్ ఉంటోంది. ఇప్పుడు ఈ రైలు ప్రారంభ వేళలు మార్చాలని పెద్ద ఎత్తున రైల్వే శాఖకు వినతులు వస్తున్నాయి. దీని పైన అధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications