కూలీ పనులకు వచ్చి మృత్యువాత పడిన విద్యార్థులు, యువకులు
గుంటూరు: సెలవుల్లో కూలీ పనులకు వచ్చిన విద్యార్థులు, యువకులు మృత్యువాత పడిన విషాద సంఘటన గుంటూరులో చేరుకుంది. గుంటూరులోని ఓ వాణిజ్య సముదాయంలోని నిర్మాణ ప్రదేశంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు.
భవన నిర్మాణంలో భాగంగా పునాది తవ్వకం పనులు చేస్తున్న కార్మికులపై మట్టిపెళ్లలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ఎనిమిది మంది అందులో కూరుకుపోయారు. శనివారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. ఏడుగురు మరణించగా, ఒకరిని ప్రాణాలతో బయటకు తీశారు.
మృతుల్లో నలుగురిని బి.సెల్వమాన్(20), తురకా శేషుబాబు(19), బత్తుల సునీల్, బత్తుల రాకేశ్‌గా గుర్తించారు. దుర్ఘటన జరిగినప్పుడు మొత్తం 18 మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో 8 మంది మట్టిలో కూరుకుపోయారు. నగరంలోని హరిహరమహల్‌కు సమీపంలో మూడు నెలలుగా ఈ బహుళ అంతస్తుల భవనం పనులు జరుగుతున్నాయి.

నిర్మాణ ప్రదేశం చుట్టూ సుమారు 20 అడుగులు ఎత్తున్న సిమెంటు రేకులు అడ్డుపెట్టడంతో ప్రమాదం జరిగిన అర్ధగంట వరకు సమాచారం బయటకు తెలియలేదు. వేసవి సెలవులు కావడంతో కొంతమంది విద్యార్థులు కూడా ఈ పనుల్లో పాలుపంచుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కొందరు ఇనుప వూచల పనులు చేస్తున్నారు. బాధిత కూలీలు పెదగొట్టిపాడు గ్రామానికి చెందినవారని సమాచారం.
ఏడున్నర గంటలకు ప్రమాదం జరిగితే తొమ్మిది గంటలకు గానీ సహాయక చర్యలు ప్రారంభం కాలేదు. దీంతో బాధితుల కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. ప్రమాదానికి గురైనవారంతా రాష్ట్ర మంత్రి రావెల కిశోర్‌బాబు నియోజకవర్గానికి చెందినవారు.
సంఘటనా స్థలానికి వచ్చిన మంత్రి రావెల కిశోర్ బాబును బాధిత కుటుంబ సభ్యులు ఘెరావ్ చేశారు. తమను అడ్డుకున్న పోలీసులతో ఘర్షణకు దిగారు. దీంతో మంత్రి రావెల కారు దిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. శనివారం రాత్రి 11 గంటల వరకు కూడా సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. మృతుల కుటుంబాలకు 5.20 లక్షల రూపాయలేసి నష్టపరిహారాన్ని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ప్రకటించారు.
ప్రమాద స్థలికి నగర పాలక సంస్థ కమిషనర్ ఎస్ నాగలక్ష్మి, సిటీ ప్లానర్ ధనుంజయ రెడ్డి, ఇతర అధికారులు వచ్చారు. వారిపై కూడా మృతుల బంధువులు దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనలో ధనుంజయ రెడ్డి గాయపడ్డారు.












Click it and Unblock the Notifications