బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలో వర్షాలు
ఎండలు మండిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి తీపికబురు అందింది. బంగాళాఖాతం గగనతలంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు పలు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి. ఉత్తరాంధ్ర మొదలుకుని రాయలసీమ వరకూ పలు జిల్లాల్లో చెదురుమదురు నుంచి ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆ సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉందని సూచించింది.
పశ్చిమ- మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకొని ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది చురుకుగా కదులుతోంది. ఇది మరింత విస్తరించడానికి అనుకూల వాతావరణం నెలకొంది. ఉత్తరాంధ్రతో పాటు ఛత్తీస్ గఢ్, తెలంగాణ ఉత్తర ప్రాంతం మీదుగా ఇది విస్తరిస్తోంది. దీని ప్రభావంతో నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి చెదురుమదురుగా ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.

ద్రోణి, నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశాలు లేకపోలేదు.
అలాగే రాయలసీమ రీజియన్ లోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది.
పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, వ్యవసాయ కార్మికులు చెట్ల కింద ఆశ్రయం తీసుకోకూడదని హెచ్చరించింది. బలమైన గాలుల వల్ల కొమ్మలు విరిగిపడొచ్చని, పిడుగులు పడే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.












Click it and Unblock the Notifications