ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించారు: చంద్రబాబుపై షర్మిల
ప్రకాశం: తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత నేత ఎన్టీఆర్ తన కూతురును చంద్రబాబుకు ఇచ్చి వివాహం చేయడమేగాక అతనికి రాజకీయ భిక్ష పెట్టారని తెలిపారు. అలాంటి వ్యక్తిపై చెప్పులు వేయించిన ఘనత చంద్రబాబుదేనని షర్మిల ఆరోపించారు.
ఆమె శనివారం ప్రకాశం జిల్లా అద్దంకిలో నిర్వహించిన రోడ్‍షోలో ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు హార్స్ పవర్ ఛార్జీని రూ. 50 నుంచి 600 చేసిన ఘనుడని షర్మిల ధ్వజమెత్తారు. రైతులను రాజులుగా చేసిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని, ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత ఆయనదేనని అన్నారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయంబర్స్‌మెంటుతో పేద విద్యార్థులకు పెద్ద చదువులు అందించారని తెలిపారు. చంద్రబాబు 16 లక్షల మందికి పింఛన్లు ఇస్తే.. వైయస్ఆర్ 71 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజలు ఓటు వేసే ముందు ఒక్కసారి వైయస్సార్‌ను గుర్తుకు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. వైయస్ ప్రవేశపెట్టిన పథకాలకు ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డి తూట్లు పొడిచారని ఆరోపించారు.
మన భవిష్యత్‌ను మనమే నిర్ణయించుకుందామని, ప్రధానమంత్రి కూర్చిలో ఎవరు కూర్చోవాలో మనమే నిర్ణయిద్దామని షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సీమాంధ్రను అభివృద్ధి బాటలో నడిపిద్దామని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం జగనన్న తన జీవితాన్ని త్యాగం చేసేందుకు సైతం సిద్ధమని షర్మిల తెలిపారు.












Click it and Unblock the Notifications