శిల్పా అనుచరుడిపై భూమా వర్గీయుల దాడి: కళ్లల్లో కారం చల్లి ఇనుప రాడ్లతో కొట్టారు
అమరావతి: కర్నాలు జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు భగ్గుమన్నాయి. అధికార తెలుగుదేశం పార్టీలో మరోసారి విబేధాలు బయటపడ్డాయి. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి అనుచరుడు తులిసి రెడ్డిపై సోమవారం అర్ధరాత్రి హత్యాయత్నం జరిగింది. గుర్తు తెలియని దుండగులు అతడిపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తులిసి రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు.
వివరాల్లోకి వెళితే నంద్యాలలో న్యాయవాదిగా పనిచేస్తున్న తులసి రెడ్డి టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. అంతేకాదు మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. సోమవారం రాత్రి తన ఆఫీసులో పని ముగించుకుని బయటికి రాగానే అక్కడే కాపు కాసిన భూమా వర్గానికి చెందిన బాలనాగిరెడ్డి, మరికొంత మంది ఆయన కళ్లల్లో కారం చల్లి ఇనుప రాడ్లతో దాడికి దిగారు.
ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన తులసిరెడ్డిని తొలుత కర్నూలు జనరల్ ఆసుపత్రి, ఆ తర్వాత మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తులసిరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఈ ఘటన కర్నూలు జిల్లా టీడీపీలో పెను దుమారం రేపింది.

తులిసి రెడ్డి గతంలో కొత్తపల్లి సర్పంచ్‌గా పనిచేశారు. దాడి అనంతరం వెంటనే స్పందించిన ఆయన కుటుంబ సభ్యులు ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వర్గీయులే ఈ దాడికి పాల్పడిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భూమా అనుచరుడు బాలనాగిరెడ్డి సహా 9 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారికోసం గాలింపు మొదలుపెట్టారు.
అయితే స్థానికులు మాత్రం ఈ దాడిలో ముగ్గురు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ దాడికి సంబంధించిన ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు తెలిపారు. ఈ దాడి ఘటనపై మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈదాడికి ఘటనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.
పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఫిర్యాదు చేస్తానని కూడా ఆయన పేర్కొన్నారు. దాడికి పాల్పడ్డవారిని తక్షణం అరెస్ట్ చేయాలని శిల్పామోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాగా ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని భూమా నాగిరెడ్డి అన్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.
మరోవైపు పాత కక్షల నేపథ్యంలోనే దాడి జరిగి ఉండొచ్చని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని భూమా వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ దాడితో నంద్యాల పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. తులసిరెడ్డి వర్గీయులు ఎక్కడ ప్రతిదాడులకు దిగుతారోనన్న అనుమానంతో పోలీసులు కొత్తపల్లిలో పికెట్ ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications