జగన్, చంద్రబాబులను బెదిరిస్తున్నారు: ప్రత్యేక హోదాపై హీరో శివాజీ
హైదరాబాద్: ప్రత్యేక హోదాపై మాట్లాడితే కేసులున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని బెదిరిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని బెదిరిస్తున్నారని తెలుగు సినీ నటుడు శివాజీ అన్నారు. నిజాయితీగా ఉంటే పోరాటం చేయడానికి జగన్ ముందుకు రావాలని, తప్పు చేయలేదంటే చంద్రబాబు ముందుకు రావాలని, వారు ముందుకు వారి వెంట తాము ఉంటామని ఆయన చెప్పారు. కొత్త రాష్ట్రాన్ని హత్య చేస్తోందెవరు అంటూ గురువారం ఆయన ఓ కరపత్రం విడుదల చేసి మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాను సింపుల్‌గా చూపే నేతలను సిల్లీ ఫెల్లోలు అంటానని ఆయన అన్నారు.
ప్రత్యేక హోదాపై ఆయన కేంద్ర మంత్రులకు అల్టిమేటం జారీ చేశారు. ప్రత్యేక హోదా సాధించడానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రులకు నెల రోజుల సమయం ఇస్తున్నామని, ఈలోగా సాధించకపోతే మంత్రుల ఇళ్ల ముందు నిరసనలు వ్యక్తం చేస్తామని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఇది సామాన్యులు చేస్తున్న ఉద్యమమని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రులూ, ఖబడ్దార్ అని ఆయన హెచ్చరించారు. తనతో పెట్టుకోవడం ఆషామాషీ కాదని ఆయన అన్నారు. మీరు ఎన్ని పదవులు పంచుకున్నా, ప్రజలకు అన్నం పెట్టండని ఆయన రాజకీయ నేతలను ఉద్దేశించి అన్నారు.

తనకు స్కామ్‌లూ స్కీములూ లేవని, మాట్లాడే ధైర్యం ఉందని ఆయన అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారి కోసమే రాజధాని నిర్మాణమని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా తేకండా ఎపికి వచ్చే ఆలోచన చేయవద్దని ఆయన కేంద్ర మంత్రులను హెచ్చరించారు. బ్యాంకు రుణాలు తీసుకుని, వాటి విషయంలో వ్యక్తిగత రక్షణ కోసం మాత్రమే కేంద్ర మంత్రులు పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.
14వ ఆర్థిక సంఘం తన దృష్టిలో ఓ చెత్త సంఘమని, ఆంధ్రప్రదేశ్ అంటే ఆర్థిక సంఘానికి చులకనైపోయిందని ఆయన అన్నారు. ఎపి రాజకీయ నాయకులకు ఉప్పు తిన్న విశ్వాసం కూడా లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా వల్ల జరిగే మేలుపై వీడియో రూపొందించి యూట్యూబ్‌లో పెట్టనున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కోసం కొన్ని మండలాలను ఎపిలో కలిపి ఏదో చేసిందని చెబుతున్నారని అంటూ ఆ విషయంలో ఎలా అన్యాయం జరిగిందో తన వాదనను ఆయన వినిపించారు.
తాను నీచమైన ఆలోచనలను పెట్టుకోలేదని, మంత్రులు తమకు కావాలని, తాము ఎన్నికున్నాం కాబట్టి తమకు కావాలని, తమ ప్రమేయం లేకుండా వారు మంత్రులు కావచ్చు గానీ వారిని తామే ఎన్నుకున్నామని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా వద్దని కొంత మంది అంటున్నారని చెబుతూ అటువంటివారిపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎపి రాజధానిని సింగపూర్ చేస్తామని అంటున్నారని, ఎప్పుడు అలా అయ్యేదని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, ఇచ్చిన మాట తప్పకూడదని ఆయన అన్నారు.
ఓటు వేయడానికి డబ్బులు ఇవ్వవద్దని, ప్రజలకు మేలు చేస్తే చాలునని ఆయన రాజకీయ నాయకులను ఉద్దేశించి అన్నారు. తాను విమర్శించాలి కాబట్టి విమర్శించడం లేదని, కుచ్చిత రాజకీయాలూ కార్పోరేట్ రాజకీయాలూ మానుకోవాలని ఆయన అన్నారు. తన వద్ద డబ్బులు లేవని, చార్జీలు వెతుక్కుంటా అని, తనకు వీలైన పద్ధతుల్లో ప్రయాణం చేస్తానని, తనకు ఓపిక ఉన్నంత వరకు పోరాటం చేస్తానని శివాజీ అన్నారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు, అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రత్యేక హోదా వల్ల, ప్రత్యేక ప్యాకేజీల వల్ల మంచి జరుగుతుందని ఆయన చెప్పారు.
పరిశ్రమలు రావాలని చంద్రబాబు కష్టపడుతున్నారని, కానీ 49 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే పరిశ్రమలు ఎలా వస్తాయని, లాభాలు లేకుండా కంపెనీలు ఎపికి ఎందుకు వస్తాయని శివాజీ అన్నారు. కొంత మంది గురించి మాట్లాడాలంటే సంస్కారం అడ్డు వస్తోందని అన్నారు. పార్టీల మధ్య విభేదాలున్నా ప్రత్యేక హోదా కోసం కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications