బాబుకు షాక్: పిపిఎల రద్దుపై ఎపి జెన్కో లేఖ వెనక్కి
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను (పిపిఎలను) రద్దు చేయాలనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎదురుదెబ్బ తగిలింది. పిపిఎలను రద్దు చేయాలని ఎపి జెన్కో రాసిన లేఖను విద్యుత్తు నియంత్రణ సంస్థ (ఈఆర్‌సి) తిరస్కరించింది. పిపిఎలు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినందున రెండు రాష్ట్రాల డిస్కంలు కలిసి కోరితేనే రద్దు సాధ్యమని ఈఆర్‌సి స్పష్టం చేసింది.
తెలంగాణ డిస్కం దానికి అంగీకరించే ప్రసక్తి లేదు. దాంతో పిపిఎల రద్దు సాధ్యం కాదనేది తేలిపోయింది. పిపిఎలను రద్దు చేయాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా తప్పు పట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. రాష్ట్ర వునర్వ్యస్థీకరణ బిల్లులో పొందుపరిచిన అంశాన్ని రద్దు చేయడం కుదరదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది.

పిపిఎలను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ జెన్కో రాసిన లేఖ విషయంలో వివాదం తలెత్తడంతో కేంద్రం కూడా జోక్యం చేసుకుంది. పిపిఎలను రద్దు చేస్తే తెలంగాణకు 460 మెగావాట్ల విద్యుత్తుకు కోత పడుతుంది. దీనివల్ల తెలంగాణలో తీవ్రమైన సమస్య తలెత్తుతుంది. కేంద్రం జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపేసింది.
గతవారం నాగార్జునసాగర్ నుంచి కృష్ణా, గుంటూరు ప్రకాశం జిల్లాలకు పది టిఎంసిల నీటిని విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నిరాకరించింది. దీనికి ప్రతీకారంగానే పిపిఎలను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications