జగన్ ఇలాకాలో ఆ భూముల రిజిస్ట్రేషన్ లు రద్దు, కేసులు కూడా!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ ల పైన కఠిన చర్యలు తీసుకుంటోంది. అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటే సహించేది లేదని తేల్చి చెబుతోంది. తాజాగా కడప జిల్లాలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ లను రద్దుచేసి కొంతమందికి జిల్లా కలెక్టర్ ఊహించని షాక్ ఇచ్చారు.
కడప జిల్లాలో ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు
కడప పరిధిలోని సీకే దిన్నె మండలంలో గత ప్రభుత్వ హయాంలో కొంతమంది నాయకులు ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి.నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూములను గత పాలకుల అండదండలతో కొంతమంది తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఫిర్యాదులు రావడంతో దీనిపైన విచారణ జరిపిన కలెక్టర్ ఇప్పటికే పలు గ్రామాలలో 20 కోట్ల విలువైన భూముల రిజిస్ట్రేషన్ లను రద్దు చేశారు.

లోతుగా దర్యాప్తు చేయిస్తున్న జిల్లా కలెక్టర్
ముఖ్యంగా చెర్లోపల్లె, కృష్ణాపురం గ్రామాలలో ఉన్న 20 కోట్ల విలువైన భూముల రిజిస్ట్రేషన్ లను జిల్లా కలెక్టర్ రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ మరో 68 అక్రమ రిజిస్ట్రేషన్లను గుర్తించి వాటిని కూడా రద్దు చేశారు.కమలాపురం, కడపకు చెందిన కొంతమంది సీకే దిన్నె మండలంలోని ప్రభుత్వ భూములను అక్రమంగా తమ పేర్లు ఉన్నట్లు గుర్తించిన కలెక్టర్ దీనిపైన లోతుగా దర్యాప్తు చేయిస్తున్నారు.
500 కోట్ల రూపాయల విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు
మొత్తం 68 డాక్యుమెంట్ల కింద 500 కోట్ల రూపాయల విలువైన భూములను అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు అధికారులు గుర్తించారు. సీకే దిన్నె మండలంలోని రామచంద్రాపురం, కొప్పర్తి, కృష్ణాపురం, తాడి గొట్ల, మామిళ్లపల్లె, విశ్వనాధపురం, ఊటుకూరు లలో ఈ అక్రమాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం కొంతమందికి సంబంధించిన భూముల అక్రమ రిజిస్ట్రేషన్ లను రద్దు చేయగా ఇంకా 300 డాక్యుమెంట్ల పైన అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
భూముల అక్రమ రిజిస్ట్రేషన్ లు రద్దు, వారిపైన క్రిమినల్ కేసులు
2019 నుండి 2022 మధ్యకాలంలో ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్టు గుర్తించిన అధికారులు, ఈ వ్యవహారంలో ప్రభుత్వ అధికారుల పాత్ర ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయడంతోపాటు, ఈ గోల్మాల్ కు పాల్పడిన వారి పైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసే ఆలోచనలో ఉన్నారు.మాజీ సీఎం జగన్ సొంత జిల్లాలో ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ లు జరిగినట్టు గుర్తించిన క్రమంలో దీనిపైన లోతుగా ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం లేకపోలేదు.












Click it and Unblock the Notifications