మెగా డిఎస్సీ కోసం ‘చలో సీఎం క్యాంపు కార్యాలయం’; విజయవాడలో ఉద్రిక్తత!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అనేక వర్గాల వారి ఆందోళనలతో ఏపీ అట్టుడుకుతోంది. ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులు, సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు ఇలా వివిధ వర్గాల వారు ఆందోళనలు నిర్వహిస్తుంటే నిరుద్యోగులు సైతం మెగా డీఎస్సీ కోసం నిరసనల బాట పట్టారు.
ఇప్పటికే జనవరి మొదటి వారంలోగా డీఎస్సీ ప్రకటన చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే. . గత ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ఇచ్చిన డిఎస్సీ హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేయగా తాజాగా సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడించాలని నిరుద్యోగులు పిలుపునిచ్చారు.

ఈ క్రమంలో నేడు యువజన సంఘాల నాయకులు, నిరుద్యోగులు పిలుపునిచ్చిన చలో సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. భారీ సంఖ్యలో విజయవాడకు చేరుకున్న నిరుద్యోగులు బెంజ్ సర్కిల్ నుంచి సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి బయలుదేరి వెళ్లారు. వీరు నేతాజీ వంతెన వద్దకు చేరుకోగానే అడ్డుకున్న పోలీసులు వారిని సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లకుండా నిరోధించారు.
ఈ క్రమంలో నిరుద్యోగులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు నిరుద్యోగులను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తమను బలవంతంగా అరెస్టు చేయడంపై అసహనం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట మేరకు మెగా డీఎస్సీ ప్రకటించి ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏపీలో 40 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించడంతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.ఏపీ సీఎం నాలుగున్నర ఏళ్ల పాలనలో నిరుద్యోగులను పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications