సింహాచలం అప్పన్న స్వామికి జనవరిలో రికార్డు స్థాయిలో ఆదాయం...
సింహాచలం అప్పన్నకు జనవరి నెలలో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. విశాఖ జిల్లాలో కొలువై ఉన్న శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి హుండీకి భారీ ఆదాయం వచ్చింది. జనవరి నెలలో వరుస సెలవులు, సంక్రాంతి పండుగ సెలవులతో నెలరోజుల్లోనే సింహాచలం అప్పన్న స్వామికి భారీ ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు సింహగిరిపై అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సంబరాలతో ఆలయ హుండీ ఆదాయం అధిక సంఖ్యలో పెరిగిందని దేవస్థానం అధికారులు వివరించారు.
ఇక్కడ సింహాచలం ఆలయంలో శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామి కొలువై ఉన్నాడు. ఉత్తరాంధ్ర జిల్లాల వారంతా ఈ స్వామి వారి దర్శనం కోసం బారులు తీరుతారు. ఇక, సెలవుల్లో, పండుగ వేళ్లలో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. సంక్రాంతి సందర్భంగా ఈ ఆలయ హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. ఈ కార్యక్రమం సింహగిరిపైనున్న పరకామణి కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ నగదు లెక్కింపు ప్రక్రియ ఆలయ ఈవో సింగల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో జరిగింది.

గత నెలలో ఆలయానికి వచ్చిన మొత్తం ఆదాయం రూ.2,24,90,276 ఆలయ అధికారులు తెలిపారు. జనవరిలో వచ్చిన వరుస సెలవులతో పాటు సంక్రాంతి సెలవులు రావడంతో ఈ నెల రోజుల్లోనే ఇంత ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. సింహాచలం అప్పన్నస్వామికి భక్తులు కానుకల రూపంలో రూ.2,24,90,276 సమర్పించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఇతర దేశాలకు చెందిన కరెన్సీ కూడా హుండీల్లో సమర్పించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మలేషియా, నేపాల్ తదితర దేశాలకు చెందిన డాలర్లు హుండీలో భక్తులు సమర్పించినట్లుగా దేవస్థానం అధికారులు వివరించారు. వీటితోపాటు 143.900 గ్రాముల బంగారం, 14 కిలోల వెండి హుండీలలో లభ్యమైనట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications