ఓటు వేయడానికి ఏపీకి వచ్చి.. సజీవ దహనం
Road accident: ఏపీలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా చిలకలూరి పేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరు మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తోన్నారు.
మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా చీరాల నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ప్రైవేటు బస్సు చిలకలూరిపేట మండలం పసుమర్రు సమీపంలోని ఈవూరిపాలెం వద్ద ప్రమాదానికి గురైంది. పిడుగురాళ్ల- వాడరేవు బైపాస్ రోడ్డు పనుల కోసం కంకరను తీసుకొస్తోన్న టిప్పర్‌ను వేగంగా ఢీ కొట్టింది.

ఈ ఘటనలో టిప్పర్‌లో తొలుత మంటలు చెలరేగాయి. వెంటనే బస్సుకూ వ్యాపించాయి. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ అంజితో సహా అయిదుమంది సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. వారిని నీలాయపాలేనికి చెందిన ఉప్పుగుండూరు కాశీ, ఉప్పుగుండూరు లక్ష్మీ, ముప్పరాజు ఖ్యాతి సాయిశ్రీ, చీరాలకు చెందిన బస్సు డ్రైవర్ అంజిగా గుర్తించారు.
బస్సులో ప్రయాణిస్తోన్న వారిలో 20 మందికి పైగా గాయపడ్డారు. బస్సు పూర్తిగా మంటలకు అహూతి అయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సను అందించారు. వారికి ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది.
బస్సులో ఉన్న ప్రయాణికులందరూ చిన్నగంజాం, గోనసపూడి, నీలాయపాలేనికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులకు సమాచారం ఇచ్చారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెప్పారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి వాళ్లంతా హైదరాబాదు నుంచి వచ్చినట్లుగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications