బెజవాడలో విరిగిపడ్డ కొండచరియలు-శిథిలాల కింద ఆరుగురు ! సీఎం కీలక ఆదేశాలు..!
ఏపీని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడలోని మెగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కొండలపై నివాసం ఉంటున్న వారు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సకాలంలో మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకుని వారిని కాపాడారు. ఈ ఘటనలో మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారనే ప్రచారం జరుగుతోంది.
మొగల్రాజపురంలో భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడ్డాయి. అక్కడే ఉన్న ఇళ్లపై బండరాళ్లు పడటంతో అందులో ఉంటున్న వారు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు స్దానికులు ప్రయత్నించినా వారిపైనా బండరాళ్లు పడే ప్రమాదం పొంచి ఉండటంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇందులో రక్షించిన ఆరుగురిలో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రులకు తరలించారు.

మరోవైపు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో, పలు పట్టణాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పరిస్థితులపై అధికారులతో మాట్లాడిన సీఎం.. అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు చెయ్యాలని, అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

మ్యాన్ హాల్, కరెంట్ తీగలు తెగిపడే ప్రమాదాల జరగకుండా చూడాలని చంద్రబాబు ఆదేశించారు. అన్ని శాఖలు అలెర్ట్ గా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు. పొంగే వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలన్నారు. భారీ వర్షాలు పడే ప్రాంతాల ప్రజల మొబైల్స్ కు మెసేజ్ ద్వారా అలెర్ట్ పంపాలని సూచించారు.












Click it and Unblock the Notifications